డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్‌కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్‌కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్‌మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.
గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్‌కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ తప్పదు.
మిడిలార్డర్‌లో ఆడించాల్సి వస్తే మేనేజ్‌మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్‌గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్‌మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్‌గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.
మేనేజ్‌మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.
గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్
గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్‌డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్‌గా, ఫైన్‌గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.
కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్


