నితీశ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానంలో సెంచరీ చేసి ఆపై భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారాడు.
గతేడాది టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి.. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్న నితీశ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైంది.
నితీశ్ రోల్ ఏంటి?
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీశ్ నిజంగా ఆల్‌రౌండరేనా సందేహం వ్యక్తమవుతోంది. నితీశ్ ప్రధాన జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ నితీశ్ తిరిగి స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ సిరీస్‌లో నితీశ్‌తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు.
ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికి ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు. అయితే కోల్‌కతా టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలవ్వడం, శుభ్‌మన్ గిల్ గాయపడడంతో అతడికి మళ్లీ పిలుపు నిచ్చారు.
అయితే గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో నితీశ్‌కు చోటు దక్కింది. కానీ ఈ మ్యాచ్‌లో కూడా నితీశ్‌కు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించలేదు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం పది ఓవర్లు మాత్రమే నితీశ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 ఓవర్లు పైగా బౌలింగ్ చేస్తే.. నితీశ్‌కు కేవలం 6 ఓవర్లు దక్కాయి. నితీశ్ తన మీడియం పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.
ఇంతకుముందు ఆసీస్, ఇంగ్లండ్ టూర్‌లలో బంతితో కూడా నితీశ్ సత్తాచాటాడు. కానీ స్వదేశంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో ఆర్ధం కావడం లేదు. అదేవిధంగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
దీంతో గంభీర్‌పై అశ్విన్, ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమర్శలు వర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో అతడిని జట్టులోకి తీసుకున్నప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించడం లేదని అశ్విన్ ప్రశ్నించాడు.
నితీశ్‌కు నో ఛాన్స్
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా నితీశ్ ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రధాన ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకుని అతడిని బెంచ్‌కే పరిమితం చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అదేవిధంగా మొన్నటివరకు టీ20ల్లో భాగంగా ఉన్న నితీశ్‌ను పాండ్యా రావడంతో జట్టు నుంచి తప్పించారు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక భారత జట్టులో ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్‌కు చోటు దక్కలేదు. దీనిబట్టి నితీశ్ టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా నితీశ్ ఆడే సూచనలు కన్పించడం లేదు.
దీంతో ఆరు నెలల తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు నితీశ్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుందున నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో కచ్చితంగా చోటు దక్కుతుందో లేదో తెలియదు. ఉపఖండ పిచ్‌లు ఎక్కువ స్పిన్‌కు అనుకూలించనుందన అక్షర్, కుల్దీప్, జడేజాలతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది.
చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ


