భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్‌మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు.
ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్‌కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్‌ను ఎంపిక చేశారు.
దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్‌లో కూడా గిల్‌ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది.
అయితే సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.
అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
"సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్‌మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.
శుభ్‌మన్ ఏ ఫార్మాట్‌లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్‌లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్‌కాస్ట్‌లో దాదా పేర్కొన్నాడు.
చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?


