సూర్యకుమార్‌ యాదవ్‌ రిటైర్మెంట్‌..? | Suryakumar Yadav Likely To Announce Retirement After T20 WC 2026 Final, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్‌ యాదవ్‌ రిటైర్మెంట్‌..?

Mar 8 2026 11:08 AM | Updated on Mar 8 2026 12:11 PM

SURYAKUMAR YADAV LIKELY TO ANNOUNCE RETIREMENT AFTER T20 WC 2026 FINAL

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 8) తుది సమరం జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ టైటిల్‌ కోసం పోటీ పడతాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌ వరుసగా తమ రెండో టైటిల్‌ను సాధిస్తుందా లేక న్యూజిలాండ్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.

మండుటెండల్లో ఈ హీట్‌కు తోడు మరో సంచలన విషయం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. అదేంటంటే.. భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నేటి ఫైనల్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టైటిల్‌ గెలిచినా, గెలవకపోయినా సూర్య నిర్ణయం మారదని పలు కథనాలు వెలువడుతున్నాయి.

వయసు పైబడటం (35), మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్‌) అవకాశాలు లేకపోవడం  చేత స్కై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తరహాలోనే స్కై కూడా కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌, కోహ్లి టీ20 ప్రపంచకప్‌ 2024 గెలుపు తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

గత కొంత​కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బం​ది పడిన సూర్య.. ఈ ప్రపంచకప్‌కు ముందే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఫామ్‌లో ఉన్నప్పుడే కెరీర్‌కు పుల్‌స్టాప్‌ పెడితే గౌరవంగా ఉంటుందన్న మరో భావన కూడా సూర్య రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. నేటి ఫైనల్లో ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టు గెలుపుకు దోహదపడితే స్కై భారత కెప్టెన్‌గా తన కెరీర్‌కు న్యాయం చేసినట్లవుతుంది.

రోహిత్‌ శర్మ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య.. కెప్టెన్‌గా అసమానమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఒక్క సిరీస్‌ కూడా కోల్పోలేదు. పైగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ లాంటి మేటి జట్ట భారీ సిరీస్‌ విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీ సక్సెస్‌ రేట్‌ 80 శాతానికి పైగా ఉందంటే, అతను ఏ రేంజ్‌లో విజయాలు సాధించాడో అర్దమవుతుంది. వ్యక్తిగతంగా విఫలమైనా, స్కై కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.

స్కై రిటైర్మెంట్‌పై ఊహాగానాలు తప్పిస్తే.. ఇప్పటివరకు అతని నుంచి కానీ, బీసీసీఐ నుంచి కాని ఎలాంటి అధికారిక​ సమాచారమూ లేదు. ఈ విషయంపై సందిగ్దత వీడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement