నేడు టి20 వరల్డ్ కప్ ఫైనల్
న్యూజిలాండ్‌తో భారత్ ఢీ
జోరు మీదున్న టీమిండియా
ఆత్మవిశ్వాసంతో కివీస్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం
భారత జట్టు 2024 టి20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లు ఆడితే 40 గెలిచింది. 2023 ఆగస్టు నుంచి మన టీమ్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో పలు మార్పులు చేసుకున్నా, ఆఖరి క్షణాల్లో ఆటగాళ్లను చేర్చినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. ఎలాంటి నిర్ణయం, వ్యూహమైనా అద్భుతంగా పని చేశాయి. ఇలాంటి విజయాల తర్వాత, ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20 క్రికెట్‌లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయి. అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి, వరుసగా రెండోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించగలదా?
అవతలి వైపు ఉన్న జట్టు మనతో పోలిస్తే చిన్నదే కావచ్చు... బలాబలాల్లో, అనుభవంతో భారత్‌కు పోటీ కాకపోవచ్చు. కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్‌ను ఒక్కసారిగా బలంగా మార్చేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం... కానీ నేటి ఫైనల్లో కివీస్ ఓడితే తర్వాతి వారంలో ఆ దేశంలో అంతా మరచిపోతారు. వారి రోజూవారీ సంవాదనల్లో అది ఒక విషయమే కాదు. ఆ టీమ్‌లో స్టార్ పేసర్ లేకపోయినా, మిస్టరీ స్పిన్నర్ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉంది. ఇప్పుడు అలాంటిదే వారికి మొదటి టి20 వరల్డ్ కప్ అందించాలి. ప్రపంచకప్‌లలో పడిన ‘రన్నరప్’ ముద్రను ఆ జట్టు మార్చగలదా?
వ్యూహ ప్రతివ్యూహాలు, భావోద్వేగాలు, ప్రతిభ మాత్రమే సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి...చివరకు రోజు ముగిసేసరికి ఒక్క జట్టుకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కితే మరో జట్టుకు తీవ్ర నిరాశ ఖాయం. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి మినహా టోర్నీ ఆసాంతం టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చగా... పడుతూ, లేస్తూ ప్రయాణం సాగించిన కివీస్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో పదో టి20 వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్‌లో రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్‌పై గురి పెట్టిన జట్టు ఒకవైపు...తొమ్మిది ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు... ఒక టీమ్ టోర్నీ గెలిస్తే తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టు కావడంతో పాటు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్‌గా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మరో టీమ్ గెలిస్తే సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ కల నెరవేరుతుంది.
ఇలాంటి అంచనాల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ చాంపియన్ భారత్, న్యూజిలాండ్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండగా... కివీస్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాలని పట్టుదలగా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టి20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది.
వరుణ్ స్థానంలో కుల్దీప్!
ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన చూస్తే ఇప్పడు ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ ‘సూపర్ ఎయిట్స్’ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎంత ఘనంగా బౌలింగ్ చేసినా టి20ల్లో తాజా ఫామ్ కీలకం. దాదాపు 12 పరుగుల ఎకానమీతో అతను 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు.
వరుణ్ మిస్టరీని ప్రత్యర్థులు ఛేదించినట్లుగా కనిపిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై కూడా కాస్త సందేహం ఉన్నా... ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడిని పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు.
సంజు సామ్సన్ గత రెండు మ్యాచ్‌లలో చెలరేగిన విధంగా మరో నాకౌట్ మ్యాచ్‌లోనూ ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్ విసరడం ఖాయం.ముందుగా బ్యాటింగ్ చేస్తే మరోసారి 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చింతగా ఉండవచ్చు.
డఫీకి చోటు!
న్యూజిలాండ్ విజయావకాశాలన్నీ ఇప్పుడు ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్‌లపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరు మరోసారి శుభారంభం అందించగలరు. ఇన్నింగ్స్ మొదట్లోనే బుమ్రా, అర్ష్ దీప్ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్ రవీంద్ర ఆల్‌రౌండర్‌గా రాణిస్తుండగా, ఫిలిప్స్ బ్యాటింగ్ కూడా కీలకం. వరల్డ్ కప్‌కు ముందు భారత్‌పై చెలరేగిన మిచెల్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది.
అసలు సమరంలోనైనా అతను తన స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. చాప్‌మన్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కెపె్టన్ సాంట్నర్‌పై అటు ఆల్‌రౌండర్‌గా, ఇటు కెపె్టన్‌గా కూడా అదనపు భారం ఉంది. గతంలో ఏ కివీస్ సారథికి సాధ్యం కాని ఘనతను అందుకోవాలంటే అతను కూడా స్వయంగా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంది.
పిచ్ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ ప్రమాదకారులు కాగలరు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్లను నిలువరించేందుకు ఆఫ్‌స్పిన్నర్ మెక్‌కోన్‌కీ జట్టు సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఆల్‌రౌండర్ నీషమ్ స్థానంలో పేసర్ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది.
7 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టి20 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్‌తో ఆడిన ఒక టి20 మ్యాచ్‌లో భారత జట్టే గెలిచింది.
పిచ్, వాతావరణం
ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్‌ను ఫైనల్ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి పేస్, బౌన్స్ ఉండి బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. స్పిన్‌కు తగిన టర్న్ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా... ఆ మ్యాచ్‌ను భారత్ మరో పిచ్‌పై ఆడింది.
గత ఎనిమిది మ్యాచ్‌లలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపవచ్చు. అయితే భారత్‌పై సెమీస్‌లో ఇంగ్లండ్ ఒత్తిడిలో చిత్తయిన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మేలు. వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా రిజర్వ్ డే ఉంది.
2-2 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గత నాలుగు ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ చెరో రెండు గెలిచి 2–2తో సమంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవగా... 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపొందింది.
16 భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, పాండ్యా, దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్/కుల్దీప్.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), అలెన్, సీఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్/డఫీ.


