సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా! | T20 WC 2026 Final: As Sanju Says Will Abhishek Repeat Kohli Magic | Sakshi
Sakshi News home page

T20 WC Final: సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!

Mar 7 2026 8:33 PM | Updated on Mar 7 2026 8:41 PM

T20 WC 2026 Final: As Sanju Says Will Abhishek Repeat Kohli Magic

టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్‌ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్‌గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్‌.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. 

జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్‌లో అభిషేక్ ప్లేస్‌లో ఫినిషర్ రింకూ సింగ్‌నైనా టీమ్‌లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.

అయితే.. అభిషేక్‌ ఫామ్‌ లేమిపై సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్‌ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్‌‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ  గత వరల్డ్‌కప్‌లో ఇలానే వరుస ఫెయిల్యూర్‌లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్‌లోనూ రాణించలేకపోయాడు.

ఆ సమయంలో అప్పటి కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్‌ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. 

ఆసక్తికరంగా ఫైనల్‌లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.

దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్‌ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్‌ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!!
 

Advertisement
 
Advertisement
Advertisement