ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్ స్టార్ అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్, వరుణ్ స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.
ఏకంగా 64 పరుగులు
మరోవైపు.. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్‌లలో రాణించినా.. కీలక నాకౌట్ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ కూల్చాడు.
ఆ ఇద్దరిపై వేటు వేయాలి!
ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి వరుణ్ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా వరుణ్‌ను తప్పించి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.
నలుగురు విఫలమైనా..
‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.
బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..
అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే, బౌలర్ ఒక్క ఓవర్‌లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.
ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్‌కు 20 శాతం బౌలింగ్ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్‌లో వరుణ్ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్‌ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది.
నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తా
అయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్, వరుణ్ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు.
కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్


