భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.
యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్‌గా వైభవ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్ అండర్-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.
ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించాడు వైభవ్ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 కోసం రాజస్తాన్ రాయల్స్‌తో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.
పదో తరగతి పరీక్షలు డుమ్మా
ఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్ సూర్యవంశీ పేరు వైరల్ అవుతోంది. క్రికెట్‌తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ధ్రువీకరించారు.

102వ ర్యాంకు
మరోవైపు.. తాజాగా సంజీవ్ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైభవ్ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్ చౌహాన్ (Abhishek Chauhan) యూపీఎస్‌సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్ సర్వీస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఉన్నత విద్యావంతుల కుటుంబం
బిహార్‌లోని సమస్తిపూర్‌లో గల మొహియుద్దీన్‌నగర్ బ్లాక్‌లో గల రాజాజన్ గ్రామంలో 1999లో అభిషేక్ చౌహాన్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్, తల్లి అనురాధా రాజ్‌పుత్. అభయ్ కుమార్ సింగ్ నలంద ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.
ఇక ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ 2022 నుంచి సివిల్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్‌లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. అభిషేక్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


