breaking news
India U19
-
వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన
ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ సింహాలు (India U19 Team) గర్జించాయి. వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్‌ల్లో ఆతిథ్య జట్టును (Australia U19 Team) క్లీన్ స్వీప్ చేశాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన యువ భారత్.. వన్డే సిరీస్‌ను 3-0తో, టెస్ట్ సిరీస్‌ను 2-0తో ఊడ్చేసింది.మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 8) ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కుర్ర జట్టు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైనా.. 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది.అనంతరం భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఆసీస్‌ను 116 పరుగులకే (రెండో ఇన్నింగ్స్‌లో) కుప్పకూల్చారు. తద్వారా భారత్ ముందు నామమాత్రపు 81 పరుగుల లక్ష్యం ఉండింది.స్వల్ప ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడింది. 13 పరుగుల వద్దే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (13) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బంతికే స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డకౌటయ్యాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా భారత ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే 52 పరుగుల వద్ద విహాన్ (21) కూడా ఔటయ్యాడు. ఈసారి వేదాంత్ (33 నాటౌట్) మరో ఛాన్స్ తీసుకోకుండా రాహుల్ కుమార్ (13 నాటౌట్) సహకారంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన వైభవ్ఈ మ్యాచ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయిన ఈ కుర్ర డైనమైట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.చెలరేగిన బౌలర్లుఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో చెలరేగిపోయారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆసీస్ బ్యాటర్లు కొద్ది సేపు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (66, 38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో హెనిల్ పటేల్ 6, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్ తలో 4, నమన్ పుష్పక్ 3, దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీశారు. చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (India U19 vs Australia U19) తొలిసారి బ్యాటింగ్‌లో తడబడింది. మెక్కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వరుసగా 26, 25, 22, 20 పరుగులు స్కోర్ చేశారు. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించడం విశేషం.ఆసీస్‌కు సంతోషం ఎంతో సేపు మిగల్చలేదుదీనికి తోడు స్వల్ప లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత పేసర్ హెనిల్ పటేల్ రెండో ఓవర్లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. హెనిల్ రెండో ఓవర్లో వరుసగా తొలి, రెండో బంతులకు సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్లను పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ అప్పటికి ఖాతా కూడా తెరవలేదు. 2 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 0/2గా ఉంది.అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లోనూ చెలరేగడంతో ఆసీస్ 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన యువ భారత్ (అండర్ 19 జట్టు).. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 30) మొదలైన తొలి టెస్ట్‌లోనూ సత్తా చాటింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా యువ పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనాన్ని శాశించాడు.మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 91.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో జెడ్ హోలిక్ (38) మాత్రమే 20కి పైగా స్కోర్ చేశాడు. అలెక్స్ లీ యంగ్ (18), కెప్టెన్ విల్ మలాజ్చుక్ (21), సైమన్ బడ్జ్ (15) జాన్ జేమ్స్ (13), హేడన్ షిల్లర్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే తొలి ఆట ముగిసింది.రేపు భారత ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆసీస్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో అప్ కమింగ్ స్టార్ ఆయుశ్ మాత్రే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుందు లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. కాగా, భారత అండర్-19 జట్టు ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ను కూడా వారి సొంత ఇలాకాలో మట్టికరిపించింది. ఇటీవలికాలంలో యువ భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్లోనై వైభవ్ పర్వాలేదనిపించాడు.చదవండి: హైదరాబాద్‌లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో -
BCCI: వైభవ్ సూర్యవంశీపై స్పెషల్ ఫోకస్.. బెంగళూరులో శిక్షణ
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. దేశీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొట్టి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి.. అత్యంత పిన్న వయసులో టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ ఘనత సాధించాడు.ఇంగ్లండ్‌లో ఇరగదీసిన వైభవ్అనంతరం భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్ పర్యటన (IND vs ENG)లో యూత్ వన్డేల్లోనూ వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. యాభై రెండు బంతుల్లో శతకం సాధించి యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడిగా అవతరించాడు. అయితే, యూత్ టెస్టుల్లో మాత్రం ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.అయితే, సెప్టెంబరులో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనున్న భారత అండర్-19 జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. వచ్చే నెల 21న ఆసీస్‌తో మ్యాచ్‌లు మొదలుకానుండగా.. ఆదివారం (ఆగష్టు 10) బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి ఈ హర్యానా కుర్రాడు చేరుకున్నాడు.సీనియర్లు రిటైర్.. వైభవ్‌పై ఫోకస్తన కోచ్ మనీశ్ ఓజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఈ విషయం గురించి మనీశ్ ఓజా మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ దీర్ఘదృష్టితో ముందుకు సాగుతోంది. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా రిటైర్ అయిపోతున్నారు.ఈ క్రమంలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కుర్రాళ్లను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నాడు.రెడ్‌బాల్ క్రికెట్లోనూ ఫామ్‌లోకి రావాలికాగా వారం రోజుల పాటు వైభవ్ సూర్యవంశీ ఒంటరిగానే ఎన్సీఏలో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అతడు జట్టుతో చేరతాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ పద్నాలుగేళ్ల చిచ్చరపిడుగు రెడ్‌బాల్ క్రికెట్లోనూ ఫామ్‌లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు.‘‘మొదటి బంతి నుంచే అటాకింగ్ చేయడం వైభవ్ శైలి. టీ20, వన్డేలకు ఈ స్టైల్ చక్కగా సరిపోతుంది. ఐపీఎల్లో, అండర్-19 విజయ్ హజారే ట్రోఫీల్లో అతడి ప్రతిభను అందరూ గమనించే ఉంటారు. అయితే, వైట్‌బాల్ క్రికెట్‌తో పోలిస్తే.. సంప్రదాయ ఫార్మాట్లో మాత్రం అతడి ప్రదర్శన డ్రాప్ అయింది.రెడ్‌బాల్ క్రికెట్లోనూ వైభవ్ నిలకడగా రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యం. అతడు 10 ఇన్నింగ్స్ ఆడితే కనీసం 7-8 ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపగలగాలి. అదే మా గోల్’’ అని మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌తో భారత అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడనుంది.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు! -
‘అతడిని చూడగానే ఫిక్సయిపోయాం.. వైభవ్ ఒక అద్భుతం’
చిన్న వయసులోనే భారత క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర (Kumar Sangakkara) ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్ గన్‌షాట్‌లా ఉంటుందంటూ ఈ చిచ్చరపిడుగు ప్రతిభను కొనియాడాడు. కాగా బిహార్‌కు చెందిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించిన ఈ పిల్లాడిపై.. ఈ ఏడాది మెగా వేలంలో కాసుల వర్షం కురిసింది. రాయల్స్ జట్టు ఏకంగా రూ. 1.1 కోట్లు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వైభవ్ వమ్ము చేయలేదు.38 బంతుల్లోనే శతకంగుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే శతకం సాధించి.. ఈ ఘనత సాధించిన భారత అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్ గడ్డ మీదా వైభవ్ ఇరగదీస్తున్నాడు.ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర వైభవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తనొక స్పెషల్ టాలెంట్ అని వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే నిరూపించుకున్నాడు. 2023లో.. ‘ఓ ప్రత్యేకమైన ఆటగాడు ఉన్నాడు. అతడి బ్యాటింగ్ చూడాల్సిందే’ అని రాజస్తాన్ అనలిస్టులకు సందేశం వచ్చింది.నేనైతే ఆశ్చర్యపోయా..అప్పుడే మేమే వైభవ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాము. తొలిసారి అతడి బ్యాటింగ్‌ను నేరుగా చూసినపుడు నేనైతే ఆశ్చర్యపోయా. వీడియోల్లో చూసినదాని కంటే ప్రత్యక్షంగా చూడటం థ్రిల్లింగ్‌గా అనిపించింది.ఇక గువాహటిలో అనుకుంటా.. నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఇతర సీమర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. మంచినీళ్లప్రాయంగా షాట్లు బాదేశాడు. అతడి బ్యాటింగ్ గన్‌షాట్‌లా ఉంటుంది. ప్రతీ బంతిని అతడు ఆడేందుకు ప్రయత్నిస్తాడు’’ అంటూ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు.అదే విధంగా.. ‘‘అతడి బ్యాట్ స్వింగ్ అవుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా వైడ్ అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఈజీగా షాట్లు బాదేస్తాడు. క్రీజు నుంచి కదలడం కూడా అరుదే. షాట్ల ఎంపికలో కచ్చితత్వం ఉంటుంది.టీ20 బ్యాటర్ ఆడే ప్రతీ షాట్‌ను అతడు ఆడతాడు. అయితే, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. అతడు అంచెంలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సంగక్కర స్కై స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అరంగేట్రంలోనే ఆసీస్ బ్యాటర్ విధ్వంసం.. విండీస్ చిత్తు -
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్‌లో టీమిండియా ఓటమి చవిచూసిన వేళ.. అండర్-19 క్రికెట్ జట్టు మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్ యంగ్ లయన్స్‌తో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్ములేపింది. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టిన ఆయుశ్ మాత్రే సేన.. నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 444 పరుగులు సాధించింది.భారత జట్టు ఇన్నింగ్స్‌లో ఏకంగా 26 సిక్సర్లు నమోదు కావడం విశేషం. భారత లోయర్ మిడిల్ ఆర్డర్ ఈ మేరకు చెలరేగడం విశేషం. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన 18 ఏళ్ల హర్వన్ష్ పంగాలియా (Harvansh Pangalia) సెంచరీతో కదం తొక్కాడు.52 బంతుల్లోనే 103 పరుగులుకేవలం 52 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో రాహుల్ కుమార్, కనిష్క్ చౌహాన్ ఆర్ఎస్ అంబరిష్ అర్ధ శతకాలతో మెరిశారు. రాహుల్ 60 బంతుల్లో 73, కనిషష్క్ 67 బంతుల్లో 79 పరుగులు చేయగా.. అంబరిష్ 47 బంతుల్లో 72 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.తేలిపోయిన ఆయుశ్, వైభవ్లాబొరో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ యువ సంచలనాలు కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మాత్రం ఈ మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయుశ్ ఒక్క పరుగే చేయగా.. కేవలం 17 పరుగులు చేసి వైభవ్ పెవిలియన్ చేరాడు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో మ్యానీ లమ్స్‌డన్ నాలుగు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిబ్రాంక్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ యంగ్ లయన్స్‌ను భారత బౌలర్లు 211 పరుగులకే కట్టడి చేశారు. దీపేశ్ దేవేంద్రన్ మూడు వికెట్లతో మెరవగా.. నమన్ పుష్పక్, విహాన్ మల్హోత్రా రెండేసి వికెట్లు తీశారు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ విల్ బెన్నిసన్ సెంచరీతో అలరించాడు.231 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తుఅయితే, అతడికి మిగిలిన ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో భారత్ చేతిలో ఇంగ్లండ్ 231 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. కాగా జూన్ 27 నుంచి జూలై 23 వరకు భారత అండర్-19 జట్టుకు ఇంగ్లండ్ లయన్స్ మధ్య ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్వన్ష్ గంధిగామ్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్. గుజరాత్‌లోని రాణా ఆఫ్ కచ్‌కు చెందిన చిన్న పట్టణం నుంచి వచ్చాడు. అతడి కుటుంబం ప్రస్తుతం కెనడాలో సెటిలైంది. హర్వన్ష్ తండ్రి బ్రాంప్టన్‌లో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లీడ్స్ వేదికగా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన గిల్ సేన.. 0-1తో వెనుబడి ఉంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 జట్టు ఇదేఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్ -
ఒక్క మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ మనదే
ఢాకా: ఒక్క అడుగు.. ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ఐసీసీ అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ మనసొంతం అవుతుంది. మంగళవారం ఢాకా షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన సెమీస్ లో 97 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసిన భారత యువ జట్టు సగర్వంగా ఫైనల్స్ లోకి ప్రవేశించి టైటిల్ గెలుచుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ ల మధ్య గురువారం (ఫిబ్రవరి 11న) రెండో సెమీస్ జరగనుంది. ఆ మ్యాచ్ విజేతతో ఆదివారం (ఫిబ్రవరి 14న) జరగనున్న ఫైనల్స్ లో యువ భారతజట్టు తలపడుతుంది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో తొలి 10 ఓవర్లు లంక బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి 10 ఓవర్లలో భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రేమే చేయగలిగింది. అయితే వన్ డౌన్ బ్యాట్స్ మన్ అన్మోల్ ప్రీత్ సింగ్ (72), నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (59) భారత ఇన్నింగ్ ను చక్కదిద్దారు. ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ (43), అర్మాన్ జాఫర్ (29)లు ధాటిగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 267 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఫెర్మాండో 4, కుమారా, నిమేశ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 268 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్లిద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ దారి పట్టగా, వన్ డౌన్ లో వచ్చిన మెండిస్(39), ఐదో స్థానంలో వచ్చిన అశాన్(38)ను కాసేపు పోరాడారు. ఆ తర్వాత డిసిల్వ (28), బంద్న్ సిల్వా (24)లు చేసిన పరుగులు బూడిదలోపోసిన పన్నీరయ్యాయి. లంక జట్టును 42.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా భారత్ 97 పరుగుల విజయాన్ని మూటగట్టుకుంది. మన బౌలర్లలో ఎంజే డగార్ 3, అవేశ్ ఖాన్ 2, అహ్మద్, బాతమ్, సుందర్ లు తలోవికెట్ సాధించారు.


