
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొట్టి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.
రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి.. అత్యంత పిన్న వయసులో టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లండ్‌లో ఇరగదీసిన వైభవ్
అనంతరం భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్ పర్యటన (IND vs ENG)లో యూత్ వన్డేల్లోనూ వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. యాభై రెండు బంతుల్లో శతకం సాధించి యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడిగా అవతరించాడు. అయితే, యూత్ టెస్టుల్లో మాత్రం ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
అయితే, సెప్టెంబరులో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనున్న భారత అండర్-19 జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. వచ్చే నెల 21న ఆసీస్‌తో మ్యాచ్‌లు మొదలుకానుండగా.. ఆదివారం (ఆగష్టు 10) బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి ఈ హర్యానా కుర్రాడు చేరుకున్నాడు.
సీనియర్లు రిటైర్.. వైభవ్‌పై ఫోకస్
తన కోచ్ మనీశ్ ఓజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఈ విషయం గురించి మనీశ్ ఓజా మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ దీర్ఘదృష్టితో ముందుకు సాగుతోంది. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా రిటైర్ అయిపోతున్నారు.
ఈ క్రమంలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కుర్రాళ్లను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నాడు.
రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ ఫామ్‌లోకి రావాలి
కాగా వారం రోజుల పాటు వైభవ్ సూర్యవంశీ ఒంటరిగానే ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అతడు జట్టుతో చేరతాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ పద్నాలుగేళ్ల చిచ్చరపిడుగు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ ఫామ్‌లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
‘‘మొదటి బంతి నుంచే అటాకింగ్ చేయడం వైభవ్ శైలి. టీ20, వన్డేలకు ఈ స్టైల్ చక్కగా సరిపోతుంది. ఐపీఎల్‌లో, అండర్-19 విజయ్ హజారే ట్రోఫీల్లో అతడి ప్రతిభను అందరూ గమనించే ఉంటారు. అయితే, వైట్‌బాల్ క్రికెట్‌తో పోలిస్తే.. సంప్రదాయ ఫార్మాట్లో మాత్రం అతడి ప్రదర్శన డ్రాప్ అయింది.
రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ వైభవ్ నిలకడగా రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యం. అతడు 10 ఇన్నింగ్స్ ఆడితే కనీసం 7-8 ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపగలగాలి. అదే మా గోల్’’ అని మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌తో భారత అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడనుంది.
చదవండి: క్రికెట్‌లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!