భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 29న గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3170 తగ్గి.. పసిడి ప్రియుల మదిలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.
సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 650 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2900 తగ్గింది. అంటే గంటల వ్యవధిలోనే 650 రూపాయలు కాకుండా.. అదనంగా మరో 2,250 రూపాయలు (మొత్తం 2,900 రూపాయలు తగ్గింది) తగ్గింది.
24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా మరింత తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,39,250 వద్దకు చేరింది. అంతకు ముందు రోజు రేటు రూ. 1,42,420 వద్ద ఉండేది. దీనిబట్టి చూస్తే ఈ రోజు రూ. 3,170 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3170 రూపాయలు తగ్గి.. రూ. 1,39,400 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 2950 తగ్గి, రూ. 1,27,800 వద్ద నిలిచింది.
వెండి ధరలు
వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.


