జింబాబ్వే స్టార్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది.
దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి.
చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
39 ఏళ్ల సికందర్ రజా పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రజా ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్‌గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.
2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్‌లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు.
పాకిస్తాన్‌లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అప్పటికి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.


