‘ఇమ్రాన్‌ హత్యకు ఆర్మీచీఫ్‌తో కలిసి పీసీబీ ఛైర్మన్‌ కుట్ర’ | What Imran Khan Told Sisters On Mohsin Naqvi | Sakshi
Sakshi News home page

‘ఇమ్రాన్‌ హత్యకు ఆర్మీచీఫ్‌తో కలిసి పీసీబీ ఛైర్మన్‌ కుట్ర’

Feb 18 2026 12:17 PM | Updated on Feb 18 2026 12:38 PM

What Imran Khan Told Sisters On Mohsin Naqvi

ఇమ్రాన్‌ హత్యకు పీసీబీ ఛైర్మన్‌ మొహ్సిన్ నఖ్వీ కుట్రలు చేస్తున్నారంటూ పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సోదరీమణులు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు ఆర్మీచీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో కలిసి కుట్రపన్నినట్లు డాక్టర్‌ ఉజ్మా ఖాన్‌, అలీమాఖాన్‌ ఆరోపించారు. తమకు కూడా ప్రాణ హానీ ఉందని.. హత్య చేసేందుకు కుట్రలు పన్నినట్లు వారు వెల్లడించారు. ఇటీవల జైలులో ఇమ్రాన్‌ను కలిసినప్పుడు, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయనే స్వయంగా తమకు చెప్పారని వారు పేర్కొన్నారు.

"వీరు నన్ను చంపేస్తారు.. నన్ను అంతమొందించేందుకు వారు పక్కా ప్లాన్ వేశారు" అని ఇమ్రాన్ తనతో అన్నారని ఉజ్మా ఖాన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలీమా ఖాన్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ కంటి చూపు మందగిస్తోందని, అయినప్పటికీ ఆయనకు సరైన చికిత్స చేయనీయడం లేదని విమర్శించారు. "మొహ్సిన్ నఖ్వీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారికి రక్తం రుచి మరిగింది. ఇమ్రాన్ ఖాన్‌కు గానీ, మాకు గానీ ఏమైనా జరిగితే.. ఎవరి భవిష్యత్తు తరాలను కూడా మేము వదిలిపెట్టం’’ అలీమా ఖాన్ హెచ్చరించారు.

తమ వ్యక్తిగత వైద్యులైన డాక్టర్ ఆసిమ్, డాక్టర్ ఫైసల్‌తో పరీక్షలు చేయించాలని కోరగా ప్రభుత్వం తిరస్కరించిందని వారు తెలిపారు. కుటుంబం తరపున తమ బంధువు నౌషెర్వాన్ బుర్కీ పేరును సూచించినా అధికారులు అంగీకరించలేదంటూ వారు మండిపడ్డారు. 

కాగా, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు సమాచారం. ఇమ్రాన్‌ ఖాన్‌కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌ పట్ల పాక్‌ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇటీవల విజ్ఞప్తి చేశారు. అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85 శాతం చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్‌ పేర్కొన్నారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement