పాక్‌ మాజీ కెప్టెన్‌కు గావస్కర్‌ మద్దతు.. ప్రభుత్వానికి లేఖ | Kapil Dev, Gavaskar Bat For Imran Khan, Request Pak Govt For Fair Treatment | Sakshi
Sakshi News home page

పాక్‌ మాజీ కెప్టెన్‌కు కపిల్‌ దేవ్‌, గావస్కర్‌ మద్దతు.. ప్రభుత్వానికి లేఖ

Feb 17 2026 2:28 PM | Updated on Feb 17 2026 2:36 PM

Kapil Dev, Gavaskar Bat For Imran Khan, Request Pak Govt For Fair Treatment

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచారు. ఇమ్రాన్‌ పట్ల పాక్‌ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పాకిస్తాన్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన లెజెండరీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌.

ఇమ్రాన్‌ సారథ్యంలో 1992లో పాక్‌ వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఇప్పటి వరకు మరే ఇతర పాక్‌ కెప్టెన్‌కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించిన ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. పాకిస్తాన్‌ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కారణాలతో అతడు జైలు పాలయ్యాడు.

జైలు జీవితం
ఈ క్రమంలో 2023 సెప్టెంబరు నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం ఇటీవల క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కంటిచూపు 85 శాతం పోయినట్లు ఆయన న్యాయవాది చెప్పారు. సరైన వైద్య సదుపాయం అందించాలని.. లేని పక్షంలో ఆయన పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అండగా పద్నాలుగు మంది మాజీ కెప్టెన్లు
ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ తదితరులు ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా పద్నాలుగు మందితో మాజీ కెప్టెన్లతో కూడిన బృందం పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పిటిషన్‌ పంపింది.

ప్రభుత్వానికి లేఖ
‘‘పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ లెజెండ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రికెట్‌కు అతడు అందించిన సేవలు ప్రశంసనీయం. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు తొలి వరల్డ్‌కప్‌ అందించిన వ్యక్తి అతడు.

మాలో చాలా మంది అతడి ప్రత్యర్థిగా మైదానంలో దిగాము. అయితే, పోటీ ప్రపంచంలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆల్‌రౌండర్‌గా చరిష్మా ఉంది. అంతేకాదు పాక్‌ ప్రధాని గానూ ఇమ్రాన్‌ పనిచేశారు.

సంక్షోభ సమయంలో పగ్గాలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయ స్థాయి వైద్యులను పిలిపించి ఆయనకు వైద్యం చేయాలని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సైతం పక్కనే ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నాం.

గావస్కర్‌, కపిల్‌ దేవ్‌లతో పాటు
చట్టపరంగానే వైద్య సదుపాయం అందించండి. కానీ ఆలస్యం చేయవద్దు’’ అని మాజీ కెప్టెన్లు పాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై భారత దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌తో పాటు మైకేల్‌ ఆథర్టన్‌, అలెన్‌ బోర్డర్‌, మైకేల్‌ బ్రేర్లీ, గ్రెగ్‌ చాపెల్‌, ఇయాన్‌ చాపెల్‌, బెలిండా క్లార్క్‌, డేవిడ్‌ గోవర్‌, కిమ్‌ హ్యూస్‌, నాజర్‌ హుసేన్‌, సర్‌ క్లైవ్‌ లాయిడ్‌, స్టీఫెన్‌ వా, జాన్‌ రైట్‌ సంతకాలు చేశారు.

చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Advertisement
 
Advertisement
Advertisement