మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర తీరాన్ని.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో అనుసంధానించే ‘ఇంటర్ ఓషియానిక్’ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 98 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
నౌకాదళం అందించిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో రైలులో 9 మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు.. మొత్తం 250 మంది ఉన్నారు. ఓక్సాకా, వెరాక్రజ్ రాష్ట్రాల సరిహద్దులోని నిజాండా పట్టణం మీదుగా రైలు వెళుతున్నప్పుడు.. ఒక మలుపు వద్ద రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘ఇంటర్ ఓషియానిక్ రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. గాయపడిన 98 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’ అని ఆమె వెల్లడించారు.
బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు నౌకాదళ కార్యదర్శిని, మానవ హక్కుల అధికారులను ఘటనా స్థలానికి పంపినట్లు క్లాడియా షీన్‌బామ్ తెలిపారు. ఈ ఘటనపై ఓక్సాకా గవర్నర్ సలోమన్ జారా మాట్లాడుతూ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించరని తెలిపారు. కాగా గాయపడిన వారికి మటియాస్ రోమెరో, సలినా క్రజ్, జుచిటాన్, ఇక్స్టెపెక్ ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గోడోయ్ రామోస్ విచారణకు ఆదేశించారు. 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ ఈ ఇంటర్ ఓషియానిక్ రైలును ప్రారంభించారు. ఇది పసిఫిక్ తీరంలోని సలినా క్రజ్ నుండి గల్ఫ్ తీరంలోని కోట్జాకోయాల్కోస్ వరకు సుమారు 290 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’


