రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే? | Emergency Quota in Train Do Yo Know Who is Eligible and How Indian Railways Approves It | Sakshi
Sakshi News home page

రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?

Feb 10 2026 4:29 PM | Updated on Feb 10 2026 5:02 PM

Emergency Quota in Train Do Yo Know Who is Eligible and How Indian Railways Approves It

రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి అతిపెద్ద సమస్య టికెట్ కర్ఫర్మ్‌. పండుగలు, సెలవుల్లో ట్రైన్ టికెట్ కర్ఫర్మ్‌ అవ్వడం అనేది చాలా కష్టం. తత్కాల్ టికెట్లు సైతం కొన్నిసార్లు కష్టమైపోతాయి. అయితే ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా ఒకటి ఉంటుందని బహుశా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?, ఎవరికి కేటాయిస్తారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా.. అనేది అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రిజర్వేషన్ విధానం. ఇది సాధారణ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ఈ కోటా ద్వారా టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది.

భారతీయ రైల్వే.. ప్రతిరోజూ అనేక మంది ప్రయాణికుల నుంచి అత్యవసర ప్రయాణ అభ్యర్థనలు స్వీకరిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. ముఖ్యమైన వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం కొన్ని సీట్లు ముందుగానే కేటాయిస్తుంది. ఈ సీట్లనే ఎమర్జెన్సీ కోటా అంటారు. ఇది ప్రతి రైలులో, ప్రతి క్లాస్‌లో ఉండకపోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని రైళ్లు, కొన్ని తరగతుల్లో మాత్రమే పరిమితంగా ఉంటుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కోటా ప్రధానంగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్ల కోసం ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు, వారి అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ఈ కోటా ఉపయోగిస్తారు.

ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా.. రైల్వే శాఖ ఇతర అత్యవసర అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో కుటుంబంలో మరణం, తీవ్రమైన అనారోగ్యం, ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన పరిస్థితులు మొదలైనవి ఉన్నాయి. అంటే వీరికి కూడా ఎమర్జెన్సీ కోటా కింద సీటు అందిస్తారన్నమాట.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. భారతీయ రైల్వేకు ప్రతిరోజూ అనేక స్థాయిల నుంచి అనేక అభ్యర్థనలు వస్తుంటాయి. ఇందులో ఏ అభ్యర్థనకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాధాన్యతను 'వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్' అనే నియమావళి ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే.. పదవి, హోదా, అధికార స్థాయి ఆధారంగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ కోటా సీట్లు ముందుగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ హోల్డర్లు & పార్లమెంట్ సభ్యుల స్వంత ప్రయాణానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా వారి హోదా ప్రకారం ఉన్న సీనియారిటీ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఇతర అభ్యర్థనలను పరిశీలించి.. ప్రయాణికుల అధికారిక హోదా, ప్రయాణ అత్యవసరత వంటి అంశాలను బట్టి కేటాయిస్తారు.

ఎమర్జెన్సీ కోటా సెల్స్.. అనేవి జోనల్ & డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో, అలాగే కొన్ని ముఖ్యమైన నాన్ హెడ్‌క్వార్టర్ స్టేషన్లలో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, రైల్వే బోర్డు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు కేవలం రాతపూర్వకంగా వచ్చిన అధికారిక అభ్యర్థనల ఆధారంగానే మంజూరు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న, ముఖ్యమైన బాధ్యతలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం.

ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement