పాక్‌లో ఆత్మాహుతి దాడి | Explosion at Religious Centre in Islamabad | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఆత్మాహుతి దాడి

Feb 6 2026 3:35 PM | Updated on Feb 7 2026 1:14 PM

Explosion at Religious Centre in Islamabad

షియా మసీదులో పేలుడు 

50 మంది దుర్మరణం 

169 మందికి గాయాలు

ఇస్లామాబాద్‌: కల్లోల పాకిస్తాన్‌లో మరో ఆత్మాహుతి చోటుచేసుకుంది. షియా వర్గీయులే లక్ష్యంగా జరిగిన ఈ దారుణంలో కనీసం 50 మంది దుర్మరణం పాలయ్యారు. 169 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని ఇస్లామాబాద్‌ శివార్లలో ఉన్న షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కాళ్లూ చేతులూ తెగిపడ్డవారు, తీవ్ర గాయాలతో అల్లాడుతున్న వారికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

మృతులు, క్షతగాత్రుల బంధుమిత్రుల ఆర్తనాదాలు, రోదనలతో ఘటనా స్థలి మారుమోగిపోయింది. వారిలో తమవారు కూడా ఉన్నారేమోనని పలువురు వెదుక్కుంటుండటం కన్పించింది. ‘‘చాలామందిని ఆస్పత్రుల్లో చేరి్పంచాం. వారిలో ఎందరు బతికి బయటపడతారో చెప్పలేం’’అని పోలీసు అధికారి ఒకరు రాయిటర్స్‌ వార్తా సంస్థతో చెప్పుకొచ్చారు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పటికే 70 దాటినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మృతుల్లో ఇస్లామాబాద్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సోదరుడు, మరో బంధువు కూడా ఉన్నారు. ఆత్మాహుతి బాంబర్‌ ఒక విదేశీయుడని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అతను ఫిత్నా అల్‌ ఖ్వరాజీ అలియాస్‌ తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) సభ్యుడని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 

తమ లక్ష్యం ఎప్పుడూ పాక్‌ సైన్యం మాత్రమేనని చెప్పుకొచి్చంది. పాకిస్తాన్‌ తాలిబాన్‌గా పిలిచే టీటీపీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పలు దాడులు చేస్తూ వస్తోంది. దాడిని అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపంద చర్య. అమాయకులను లక్ష్యం చేసుకోవడం మానవత్వానికే తీరని మచ్చ’’అంటూ మండిపడ్డారు. 

ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షవ్‌కత్‌ మిర్జియోయెవ్‌ పాక్‌లో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామాబాద్‌లో గత ఆర్నెల్లలో ఇది రెండో ఆత్మాహుతి దాడి. గత నవంబర్‌లో ఒక వ్యక్తి ఏకంగా ఇస్లామాబాద్‌ కోర్టు కాంప్లెక్స్‌లోనే కారులో తనను తాను పేల్చేసుకున్నాడు! ఆ ఘటనలో 12 మందికి పైగా మరణించారు. అంతకుముందు 2008 సెప్టెంబర్‌లో ఇస్లామాబాద్‌లోని మారియట్‌ హోటల్లో జరిగిన ఆత్మాహుతి దాడి 63 మందిని బలిగొంది. 

తొలుత కాల్పులు... 
ఇస్లామాబాద్‌లోని హెహజాద్‌ టౌన్‌లో తర్లాయ్‌ ప్రాంతంలో ఉన్న ఖదీజా అల్‌ కుబ్రా ఇమాంబరాలో షియా వర్గీయులు భారీ సంఖ్యలో శుక్రవారం మధ్యాహ్న వేళ ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో ఆత్మాహుతి బాంబర్‌ లోనికి దూసుకొచ్చేందుకు ప్రయతి్నంచాడు. గేట్‌ దగ్గర గార్డులు అడ్డుకోవడంతో అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా వెల్లడించారు.

 దుండగుడు తొలుత కాల్పులకు తెగబడి తర్వాత పేలుడుకు పాల్పడ్డట్టు వారిని ఉటంకిస్తూ జియో న్యూస్‌ వార్తా సంస్థ పేర్కొంది. పేలుడు తీవ్రతకు మసీదు ప్రధాన ద్వారం కుప్పకూలడంతో పాటు సమీప భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా ఛిన్నాభిన్నమైన మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో రక్తంతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. దాడి తమ పనేనని ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు. పోలీసులతో పాటు సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. 

క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి. ఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని ఆస్పత్రుల్లో మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. పాక్‌ కొంతకాలంగా ఆత్మాహుతి దాడులతో అతలాకుతలమవుతోంది. స్వతంత్ర బలూచిస్తాన్‌ డిమాండ్‌తో ఆ ప్రావిన్స్‌లో బలూచ్తిఆన్‌ లిబరేషన్‌ ఆర్మీ నిరంతరం పాక్‌ సైనికులపై దాడులకు దిగుతోంది. ఆ క్రమంలో ఇటీవల జరిపిన ఆత్మాహుతి దాడుల్లో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడటం తెలిసిందే. సైన్యం ప్రతీకార దాడుల్లో బలోచీ సాయుధులు కూడా వందల్లో మరణించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement