జోధ్‌పూర్‌లోని వందేభారత్ స్లీపర్ డిపో
దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ డిపో
జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 13 నాటికీ మొదటి దశ పూర్తి
రూ.362 కోట్లతో రెండు దశల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో డిపో
భారతీయ రైల్వే, రైల్ వికాస్ నిగమ్ నేతృత్వంలో నిర్మాణం
జోధ్‌పూర్ డీఆర్‌ఎం అనురాగ్ త్రిపాఠి వెల్లడిరూ.362 కోట్లతో రెండు దశల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో డిపో
భారతీయ రైల్వే, రైల్ వికాస్ నిగమ్ నేతృత్వంలో నిర్మాణం
జోధ్‌పూర్ డీఆర్‌ఎం అనురాగ్ త్రిపాఠి వెల్లడి
(జోధ్‌పూర్ సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు)
దేశంలో వందేభారత్ రైళ్ల హవా కొనసాగుతోంది. సౌకర్యవంతమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికతతో వహ్వా అనిపించుకుంటున్న వందేభారత్ రైళ్ల కోసం కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రత్యేక నిర్వహణ డిపో నిర్మాణం వేగంగా సాగుతోంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని జోధ్‌పూర్ డివిజన్‌లో భగత్ కీ కోఠి వద్ద ఏర్పాటైన ఈ హైటెక్ డిపోలో మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి.
సెప్టెంబర్ 13 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు. విశాఖç³ట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జోధ్‌పూర్ డిపో కీలక కేంద్రంగా మారనుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విజయవాడ ఆధ్వర్యంలో ఏపీ మీడియా ప్రతినిధుల బృందం ఈ డిపోను సందర్శించగా.. డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) అనురాగ్ త్రిపాఠి వివరాలు వెల్లడించారు.
స్లీపర్ సర్వీసులు పెరగాలంటే..
వందేభారత్ స్లీపర్ రైళ్లకు ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు రైల్వే మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. సర్వీసుల సంఖ్య పెరగాలంటే నిరంతర పీరియాడిక్ సర్వీసింగ్, అధునాతన నిర్వహణ సౌకర్యాలు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) రష్యా–భారత్ సంయుక్త సంస్థ కినెట్ రైల్వే సొల్యూషన్స్ సహకారంతో వందేభారత్ స్లీపర్ డిపో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశ పనులు రూ.167 కోట్లతో దాదాపు పూర్తయ్యాయి.
రెండో దశతో కలిపి మొత్తం వ్యయం సుమారు రూ.362 కోట్లు. రెండు దశల పనులు పూర్తయితే ఒకేసారి 24 కోచ్‌లతో కూడిన మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లకు కేవలం ఆరు గంటల్లో పూర్తిస్థాయి పీరియాడిక్ మెయింటెనెన్స్, సర్వీసింగ్ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన నాలుగు ప్రత్యేక డిపోల్లో ఇది ఒకటి. ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, బార్మర్, అహ్మదాబాద్ మార్గాల్లో తిరిగే రైళ్లకు ఇది ప్రధాన సేవా కేంద్రంగా నిలుస్తుంది. ఇతర డివిజన్ల రైళ్లు కూడా నిర్వహణ కోసం ఇక్కడికే వస్తాయి.
ప్రపంచస్థాయి సాంకేతికత.. భద్రతకు ప్రాధాన్యం
వందేభారత్ రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు. అండర్ గేర్, అప్పర్ గేర్ తనిఖీలతో పాటు కవచ్ భద్రతా వ్యవస్థ, అడ్వాన్స్‌డ్ వీల్ అలైన్‌మెంట్, ప్రత్యేక వీల్ లేత్ లైన్లు, పిట్ లైన్లు, భారీ మరమ్మతుల కోసం అత్యాధునిక క్రేన్లతో కూడిన సిక్ లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాక్‌లు, షెడ్లు వంటి మౌలిక వసతులు రైల్వే యాజమాన్యంలోనే ఉంటాయి. రైల్వే ఉద్యోగులు, ప్రైవేట్ నిపుణులు వీటిని సంయుక్తంగా నిర్వహిస్తారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించే విధంగా విడిభాగాలు, పరికరాల కొనుగోలు జరుగుతుంది.
జోధ్‌పూర్ డివిజన్‌లో మెగా పనులు
⇒ జోధ్‌పూర్ డివిజన్‌లో బర్మేర్, జైసల్మేర్‌లలో కూడా కోచింగ్ డిపోలు అభివృద్ధి చేస్తున్నారు.
⇒ 1,625 కి.మీ. రైల్వే మార్గాలున్న ఈ డివిజన్‌లో రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో జోధ్‌పూర్, జైసల్మేర్, పాలి ప్రాంతాల్లోని మూడు ప్రధాన స్టేషన్లతో పాటు 15
⇒ అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు.
⇒ ఒక్క జోధ్‌పూర్ స్టేషన్ పునరాభివృద్ధికే రూ.500 కోట్లు కేటాయించారు. రూ.3,000 కోట్లకు పైగా వ్యయంతో 270 కిలోమీటర్ల సమ్‌ద్రి–భిల్‌ది ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి.
⇒ తొలి భాగం 2026 నాటికి, మొత్తం ప్రాజెక్టు 2028 నాటికి పూర్తికానుంది.
⇒ గూడ్స్ రైలు సేవల ద్వారా ఆదాయం పెంచడంపై దృష్టి సారించారు.
⇒ సిమెంట్, సున్నపురాయి రవాణాకు 8 కొత్త ప్రైవేట్ ఫ్రైట్ సైడింగులు నిర్మాణంలో ఉన్నాయి.
⇒ ఇవి రాబోయే మూడేళ్లలో రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపట్టారు.
⇒ వందేభారత్ స్లీపర్ రైల్ డిపో రాకతో జోధ్‌పూర్ ప్రాధాన్యత మరింత పెరగనుంది.


