భారత్ ఖాతాలో మరో నాలుగు కాంస్యాలు
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ గణేశ్‌కు కంచు పతకం
మొత్తం 66 పతకాలతో 8వ స్థానంలోనే భారత్
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. 12వ రోజు గురువారం భారత్ ఖాతాలో మరో ఆరు పతకాలు చేరాయి. పురుషుల గ్రీకో–రోమన్ రెజ్లింగ్‌లో నితేశ్ సివాచ్ రజతంతో మెరవగా...సెయిలింగ్‌లో ఒక రజతం, ఒక కాంస్యం దక్కాయి. మరోవైపు సెమీఫైనల్లో ఓడిన భారత పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు కాంస్య పతకాలతో సంతృప్తి చెందాయి. ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ ఆర్చర్ తిరుమూరు గణేశ్ మణిరత్నం నిలకడైన ప్రదర్శనతో కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం స్వర్ణాల సందడితో పోలిస్తే గురువారం ప్రదర్శన కాస్త నిరాశాజనకమే అయినా... మొత్తం 66 పతకాలతో భారత్ 8వ స్థానం పదిలంగానే ఉంది.
1962 ఆసియా క్రీడల తర్వాత...
ఆసియా క్రీడల రెజ్లింగ్ గ్రీకో–రోమన్ విభాగంలో 64 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన నితేశ్ సివాచ్ దురదృష్టవశాత్తూ స్వర్ణాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. గురువారం జరిగిన 97 కేజీల ఫైనల్లో నితేశ్ 0–4 స్కోరుతో యూరీ నకజాటో (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో అతనికి రజత పతకం దక్కింది.
1962 ఆసియా క్రీడల్లో మారుతి మానే రజతం సాధించిన తర్వాత ఈ ఈవెంట్‌లో మళ్లీ రజతం గెలుచుకున్న తొలి భారత రెజ్లర్‌గా నితేశ్ ఘనత వహించాడు. ఫైనల్లో జపాన్ ప్రత్యర్థి భారత ఆటగాడికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆరంభంలోనే నితీశ్‌ను పడగొట్టి 2–0తో ముందంజ వేసిన నకజాటో...నితేశ్ బలహీన డిఫెన్స్ అదే ప్రదర్శనను పునరావృతం చేసి పూర్తిగా పైచేయి సాధించాడు. మహిళల 62 కేజీల కాంస్య పతక మ్యాచ్‌లో భారత రెజ్లర్ మాన్సి 1–3తో అల్ట్‌జిన్ (మంగోలియా) చేతిలో ఓడిపోయింది.
పాలు అమ్ముతూ... పట్టు పడుతూ...
హరియాణా రాష్ట్రం పానిపట్ జిల్లాలోని జాగ్సీ గ్రామం నితేశ్ స్వస్థలం. పాలవ్యాపారి అయిన తండ్రి ఆనంద్ సివాచ్ పానిపట్‌లో డెయిరీ నడిపిస్తుంటాడు. జాగ్సీ గ్రామంలో పెద్ద సంఖ్యలో రెజ్లర్లు ఉన్నారు. ప్రతీ ఇంటి నుంచి ఒక పహిల్వాన్ వస్తాడంటూ వారు తమ ఊరి గురించి చెప్పుకుంటారు. ఆనంద్ సివాచ్ స్వయంగా రెజ్లర్ కాకపోయినా... ఆ ఆటపై అతనికి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే కొడుకు రెజ్లింగ్‌పై ఆసక్తి చూపిస్తే కాదనలేదు.
ఆరంభంలో ఇంటి వద్ద ఉన్న అఖాడాలోనే ప్రాథమికాంశాలు నేర్చుకున్న నితేశ్ 15 ఏళ్ల వయసు వచ్చేవరకు అటు మట్టిలో, ఇటు మ్యాట్‌పై కూడా సాధన చేశాడు. అయితే ఈ క్రమంలో మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. దాంతో తండ్రికి పాల వ్యాపారంలో సహకరించడం మినహా మరో పని లేకపోయింది. ఈ దశలో ఆట వద్దని తండ్రి చెప్పినా అప్పటికే అభిమానం పెంచుకున్న నితేశ్ రెజ్లింగ్‌కు దూరం కాలేకపోయాడు. ఒకవైపు రెజ్లింగ్ చేయాలి, మరోవైపు మోకాలును కాపాడుకోవాలి. దాంతో అతను గ్రీకో–రోమన్ స్టయిల్‌ను ఎంచుకున్నాడు.

ఫ్రీస్టయిల్‌లో శరీరంలోని ఏ భాగంపైనైనా దాడి చేయవచ్చు. కానీ గ్రీకో రోమన్ శైలిలో అలా చేయడం కుదరదు. కొడుకు ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెజ్లింగ్ శిక్షణా కేంద్రంలో అతడిని ఆనంద్ చేర్పించాడు. ఆ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలతో మొదలైన పరంపర నితేశ్‌ను అంతర్జాతీయ స్థాయి వరకు చేర్చింది. 2018లో అండర్–17 స్థాయిలో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను, తర్వాతి ఏడాది రజతం నెగ్గాడు. 2022లో అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గాడు.
గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో అతనికి సీనియర్ విభాగం తొలి అంతర్జాతీయ పతకం (కాంస్యం) దక్కగా, ఈ ఏడాది అదే పోటీల్లో అతను రజతం గెలుచుకోవడం విశేషం. ఇప్పుడు ఆసియా క్రీడల పతకంతో అతని స్థాయి మరింత పెరిగింది. ‘ఫైనల్‌కు చేరినందుకు సంతోషంగా ఉన్నా. మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. సరిగ్గా నా ఓటమికి కారణం ఏమిటో అర్థం కాలేదు. ఇక నా ఆటలో మరింత పట్టు సాధించి రాబోయే ప్రపంచ చాంపియన్‌షిప్, 2028 ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌పై దృష్టి పెడతా’ అని నితీశ్ చెప్పాడు.
గణేశ్ ఖాతాలో మరొకటి...
పురుషుల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ తిరుమూరు గణేశ్ మణిరత్నం వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. మూడో స్థానం జరిగిన పోరులో గణేశ్ 149–144తో డాంగ్ కాంగ్ డక్ (వియత్నాం)పై విజయం సాధించాడు. ఐదు సిరీస్‌లలో నాలుగు సార్లు 30/30 స్కోరు నమోదు చేసిన గణేశ్ మరో సిరీస్‌లో 29 స్కోర్ చేశాడు. వియత్నాం ఆర్చరీ పేలవ ప్రదర్శనతో 29, 29, 30, 28, 28 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి ఓటమిపాలయ్యాడు.

అంతకుముందు సెమీఫైనల్లో గణేశ్ 144–148తో కిమ్ జోంగో (కొరియా) చేతిలో పరాజయంపాలై ఫైనల్ చేరే అవకాశాలు కోల్పోయాడు. మరోవైపు బుధవారం మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికితకు నిరాశ ఎదురైంది. వ్యక్తిగత విభాగంలో చికిత క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. నూరీసా (ఇండోనేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చికిత 143–144తో ఓడిపోయింది.
షూటింగ్‌లో తడబాటు...
చివరిరోజు షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో అనీశ్ భన్వాలా ఫైనల్‌కు చేరుకున్నా పతకం నెగ్గలేకపోయాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అనీశ్ 11 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2023 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 22 పతకాలు నెగ్గగా... ఈసారి 3 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 15 పతకాలే గెలిచింది.


