చికిత ‘గోల్డెన్’ ధమాకా.. తెర వెనక సైలెంట్ హీరో! | How Hyderabad Mentor Vivek Teja Guided Chikitha to Asian Games Double Gold | Sakshi
Sakshi News home page

Asian Games: చికిత ‘గోల్డెన్’ ధమాకా.. తెర వెనక సైలెంట్ హీరో!

Oct 1 2026 9:11 PM | Updated on Oct 1 2026 9:18 PM

How Hyderabad Mentor Vivek Teja Guided Chikitha to Asian Games Double Gold

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత అద్భుతం చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చికిత.. మహిళల కాంపౌండ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. స్వర్ణ పతకాలతో పాటు 2028 ఒలింపిక్స్ కోటా కూడా ఆమె దక్కించుకుంది.

అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక హైదరాబాద్‌కు చెందిన హ్యూమన్ పర్ఫార్మెన్స్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోచ్ వివేక్ తేజా కృషి ఎంతో ఉంది. భారత ఆర్చరీ బృందంలో అధికారిక సపోర్ట్ స్టాఫ్ కాకపోయినప్పటికీ.. అతడి గైడెన్సే చికితను ఛాంపియన్‌గా నిలిపింది. తాజాగా ‘తెలంగాణ టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ తేజా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

"10 నెలల క్రితం పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత నన్ను ఫోన్‌లో సంప్రదించింది. 'సార్.. నాకు ఆసియా క్రీడల కోసం సరైన గైడెన్స్, మెంటరింగ్ అవసరం' అని చెప్పింది. దాంతో అప్పటి నుంచే ఆమెతో కోచ్‌గా నా ప్రయాణం మొదలైంది. చికిత సాధనలో భాగంగా శారీరక దృఢత్వం, పోషకాహారం, మానసిక స్థైర్యాన్ని మెరుగుపరచడంపైనే నేను ప్రధానంగా దృష్టి పెట్టాను. ముఖ్యంగా ఆమె కోర్ స్ట్రెంగ్త్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాను. అలాగే సరైన పోషకాహారం తీసుకునేలా చూశాను.

విల్లును ఎక్కువ సమయం కదలకుండా స్థిరంగా పట్టుకోవడానికి, పోటీ పూర్తయ్యే వరకు ఒకే పొజిషన్‌లో నిలబడటానికి ఇవి ఆర్చర్‌కు ఎంతగానో అవసరం. శిక్షణ మొదట్లో ఆమెకు కావాల్సినంత శారీరక దృఢత్వం లేదు. దాంతో ప్రత్యేక 'స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్' ప్రోగ్రామ్ ద్వారా ఆమె బలాన్ని మెరుగుపరిచాం.

చికిత కూడా కఠోర సాధన చేసింది. ఆసియా క్రీడలే ప్రధాన లక్ష్యంగా మేము ఎంతో శ్రమించాం. రెండు స్వర్ణ పతకాలు సాధించడం నిజంగా గొప్ప విజయం. ఆమె సక్సెస్‌లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది" అని వివేక్ తేజా పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement