సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి అయిన కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న షాపులపై టాస్క్‌ఫోర్స్, సీడీఎస్‌సీఓ అధికారులు మెరుపు దాడులు చేశారు. నాంపల్లి, హబీబ్‌నగర్‌లోని పలు షాపులు, గోడౌన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7 లక్షల విలువైన అనధికారిక కాస్మెటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయిస్తున్న ఈ ఉత్పత్తుల్లో హానికరమైన భారలోహాలు ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అక్రమ సరఫరా వెనుక ఉన్న ముంబై డీలర్ నుంచి హైదరాబాద్ వరకు సాగుతున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేపట్టారు.
నాంపల్లి, హబీబ్ నగర్‌లోని బ్యూటీ లేడీస్ ఎంపోరియం, బ్యూటీ క్వీన్ షాప్, ఎస్.జె. మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిషేధిత, అనధికారిక కాస్మెటిక్ ఉత్పత్తుల జాబితాలో ఇవి ఉన్నాయని.. భారత్‌లో దిగుమతి చేసుకోవడానికి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందలేదని అధికారులు స్పష్టం చేశారు. గుర్తించిన ఉత్పత్తులలో చర్మ కాంతి కోసం విక్రయిస్తున్న బ్యూటీ క్రీములు, సబ్బులు ఉన్నాయని.. ఇవి పాకిస్తాన్‌లో తయారయ్యాయని.. ఎలాంటి ముందస్తు అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా భారత్‌లోకి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు తేలింది.
ప్రాథమిక విచారణలో ఈ కాస్మెటిక్ ఉత్పత్తులను ముంబైకి చెందిన ఓ డీలర్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. అతను విదేశాల నుండి ఈ ఉత్పత్తులను తెప్పించి హైదరాబాద్‌లోని డీలర్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక విక్రేతలు ఈ పాకిస్తాన్ ఆధారిత ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సరైన బిల్లులు, ఇన్వాయిస్‌లు, రసీదులు నిర్వహించడం లేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఇదే తరహాలో హైదరాబాద్, సంతోష్ నగర్‌లోని మదీనా కాస్మెటిక్ యజమాని సయ్యద్ ఇస్మాయిల్ కూడా తన షాపులో ఇటువంటి అనధికార కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సరుకు ఎక్కడి నుండి వస్తుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షాపులలో లభించిన సరుకుతో పాటు, అదనపు స్టాక్‌ను ఒక గోడౌన్‌లో భద్రపరిచినట్లు అదికారులు గుర్తించారు. ఎస్.జె. మెడికల్ యజమాని, ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఆబిద్ అలీ కూడా ఈ కాస్మెటిక్ ఉత్పత్తుల విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. అదే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న రియాజుద్దీన్ అనే మరో వ్యక్తి కూడా ఈ విక్రయాల్లో భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: ఈసీ కార్యాలయం తగలబడిపోతుంది..!


