అఫ్గానిస్థాన్‌లోని 2 ప్రావిన్సులపై గత రాత్రి పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో 9 మంది మహిళలు, చిన్నారులు మృతి చెందగా, మరో 11 మంది పౌరులు గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది. అయితే పాకిస్థాన్ మాత్రం తమ దాడులు ఉగ్రవాదుల స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.
అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకారం.. దక్షిణ హెల్మండ్ ప్రావిన్స్, తూర్పు కునార్ ప్రావిన్స్‌లోని పౌరుల ఇళ్లపై దాడులు జరిగాయి. మొత్తం 3 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 9 మంది మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో 11 మంది పౌరులు గాయపడ్డారని ఆయన తెలిపారు. “ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. విశ్వవ్యాప్తంగా అంగీకరించిన అన్ని సూత్రాలను ఉల్లంఘించే దురాక్రమణ చర్యగా, నేరంగా దీనిని పరిగణిస్తున్నాం” అని ముజాహిద్ అన్నారు.
22 మంది మృతి!: పాక్
పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ మాత్రం ఈ దాడులను ఉగ్రవాదుల స్థావరాలు, శిబిరాలపై పక్కా ప్రణాళికతో నిర్వహించిన చర్యగా వివరించింది. తమ దాడుల్లో 22 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపింది. ఉగ్రవాదుల స్థావరాల్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయని, వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పాకిస్థాన్ తెలిపింది.
అఫ్గానిస్థాన్‌లో సరిహద్దు దాటి జరుగుతున్న హింస కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,100 మందికి పైగా పౌరులు మరణించడం లేదా గాయపడటం నమోదైందని ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘనిస్థాన్ మిషన్ గత వారం తెలిపింది. పాకిస్థాన్ మాత్రం పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని, తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతోంది. అఫ్గానిస్థాన్ తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందన్న పాకిస్థాన్ ఆరోపణలను ఖండిస్తోంది.
పాకిస్థాన్, అఫ‍్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు పదేపదే చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తాజా వైమానిక దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. పాకిస్థాన్‌కు భద్రతాపరమైన ముప్పు అఫ్గానిస్థాన్ నుంచే వస్తోందని పాకిస్థాన్ పేర్కొంటుండగా, అఫ్గాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.


