లష్కరే టాప్‌ కమాండర్‌ సులేమాన్‌ షా హతం! | Who Is LeT Commander Sulaiman Shah Relate JK Budgam Encounter | Sakshi
Sakshi News home page

లష్కరే టాప్‌ కమాండర్‌ సులేమాన్‌ షా హతం!

Sep 30 2026 6:43 AM | Updated on Sep 30 2026 6:53 AM

Who Is LeT Commander Sulaiman Shah Relate JK Budgam Encounter

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. లష్కరే తోయిబా (LeT)కు చెందిన టాప్‌ ఉగ్రవాది సులేమాన్‌ షా అలియాస్‌ మూసా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బడ్గామ్‌ జిల్లాలోని యూస్‌మార్గ్‌ సమీపంలోని దూద్‌పథ్రీ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో అతడు మరణించినట్లు అధికారులు తెలిపారు.

కోరాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో భారత సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. రాష్ట్రీయ రైఫిల్స్‌ దళాలు ఇతర భద్రతా బలగాలతో కలిసి ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన సైనికులు ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే వారు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సైన్యం వెల్లడించింది. చనిపోయింది సులేమాన్‌ షాగా నిర్ధారించుకున్నారు.

అనేక దాడుల్లో కీలక పాత్ర
హతమైన మూసా గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్‌లోని పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణికి ఇరువైపులా జరిగిన పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా అధికారులు పేర్కొన్నారు. డేరా కి గలి అంబుష్‌, ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై దాడి, 2024 గందర్‌బల్‌ టన్నెల్‌ దాడి, గుల్మార్గ్‌ సమీపంలోని బుటాపథ్రీ దాడి వంటి ఘటనల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు భద్రతా వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో సైనికులు, భద్రతా సిబ్బందితో పాటు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడి కోసం భద్రతా బలగాలు చాలాకాలంగా గాలిస్తున్నాయి. లష్కరే తోయిబా కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఉగ్రవాదిగా అధికారులు గుర్తించారు.

ఈ నెల ప్రారంభంలో యూస్‌మార్గ్‌ కొండల్లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌ నుంచి మూసా తప్పించుకున్నాడు. సెప్టెంబర్‌ 5న జరిగిన ఆ ఆపరేషన్‌లో అతడి సన్నిహిత సహచరుడు యాసిర్‌ హతమయ్యాడు. అప్పటి నుంచి మూసా కోసం భద్రతా బలగాలు ప్రత్యేకంగా నిఘా కొనసాగించాయి.

ఆపరేషన్‌ కొనసాగింపు
ప్రస్తుతం కోరాగ్‌–యూస్‌మార్గ్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారా అనే కోణంలో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మూసా హతం కావడం లష్కరే తోయిబా కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తోటి జవాన్లపై ఘాతుకం.. నలుగురి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement