ఒత్తిడి, వివక్ష, వేధింపులు... | Students are dying by suicide: SC task force survey | Sakshi
Sakshi News home page

ఒత్తిడి, వివక్ష, వేధింపులు...

Sep 30 2026 4:54 AM | Updated on Sep 30 2026 4:54 AM

Students are dying by suicide: SC task force survey

ఉన్నత విద్యా సంస్థల్లో వేళ్లూనుకున్న సామాజిక రుగ్మతలు!

పీడిస్తున్న కుల, లింగ వివక్ష 

ర్యాంకులు, మార్కులను బట్టి సిబ్బంది ట్రీట్మెంట్‌ 

మానసిక సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు 

ఎన్‌టీఎఫ్‌ మధ్యంతర సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్య భారమైపోతోందా? ఒత్తిడిని తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? అందరి విషయంలో కాకపోయినా గత ఆరునెలల్లో కనీసం 15 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక దశలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు అంటోంది సుప్రీంకోర్టు నియమించిన నేషనల్‌ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎఫ్‌). ఈ సమయావధిలో ఆత్మహత్య ఆలోచనలు చేసిన విద్యార్థులు తొమ్మిది శాతం వరకూ ఉన్నారని తెలిపింది.  దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలపై తరచూ వార్తలొస్తున్నాయి. ఢిల్లీ, బాంబేల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంపై పెద్ద దుమారమే రేగుతోంది.

 విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటైన నేషనల్‌ టాస్‌్కఫోర్స్‌ ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎన్‌టీఎఫ్‌ అక్టోబరు 31వ తేదీ లోగా తుది నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే సమర్పించిన మధ్యంతర నివేదిక ప్రకారం.... దేశంలో ఉన్నత విద్య వ్యవస్థలో సామాజిక వివక్ష వేళ్లూనుకుపోయింది. 

అంతేకాకుండా వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, వైద్య, న్యాయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది స్వయంగా లింగ వివక్ష, చూపుతున్నారని తేల్చింది. విద్యాపరమైన సాయం అందించే విషయంలోనే కాకుండా, హాస్టళ్లలో కర్ఫ్యూలు విధించడం, కులాలకు తగ్గట్టుగా వ్యవహరించడం సామాన్యమైపోయాయి అని ఈ ఆ నివేదిక తెలిపింది. నీట్‌–యూజీ, జేఈఈ ర్యాంకులు, మార్కుల ఆధారంగా కుల ఆధారిత అవహేళన, వివక్షలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. అడ్మిషన్లు మొదలుకొని గ్రేడ్లు, భాష అంతరాలు, సిబ్బంది వ్యవహారాలన్నింటిలోనూ ఇది కొనసాగుతోందని తెలిపింది.

  సర్వేలో భాగంగా ఎన్‌టీఎఫ్‌ సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులను ప్రశ్నించింది. వీరిలో 67 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు. విద్యార్థుల స్పందనల ప్రకారం స్థాయీ బేధాలు కొన్ని ఉన్నా కనీసం 34 శాతం మంది తాము క్యాంపస్‌లలో పరాయివాళ్లుగా ఫీలవుతున్నట్లు స్పష్టం చేశారు. గడచిన ఆరునెలల కాలంలో ఏదో ఒక దశలో కొన్ని వారాలపాటు మానసికంగా కుంగిపోయిన సందర్భాలున్నాయని 15 శాతం మంది విద్యార్థులు చెప్పగా.. ఏడాదిగా తరచూ లేదా అప్పుడప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కలుగుతున్నట్లు తొమ్మిది శాతం మంది తెలిపారు.

 అయితే సీరియస్‌ అంశాల విషయంలో తాము విద్యా సంస్థల నిర్వాహకులను నమ్ముతున్నట్లు 56 శాతం మంది తెలపడం విశేషం. మానసికంగా కుంగిపోయిన సందర్భాల్లో సంస్థలు తమకు ఎలాంటి కౌన్సిలింగ్‌ సేవలు అందించలేదని చెప్పిన వాళ్లు 32 శాతం మంది. ఆసక్తికరంగా... ఎంచుకున్న కోర్సు, ఉద్యోగాలకు సంబంధించిన ఆందోళనలు విద్యార్థుల్లో సహజమేనని విద్యా సంస్థల అధికారులు చెబుతున్నారు! ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్న వారి సంఖ్య 2011– 2022 మధ్యకాలంలో ఎక్కువైనప్పటికీ నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌’ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతి లక్ష మంది విద్యార్థులకు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా 26.37 నుంచి 30.02కు పెరిగినట్లు ఒక అధికారి తెలిపారు. 

విద్యార్థుల్లో ఎక్కువమంది అటెండెన్స్‌ను కఠినంగా అమలు చేయడంపై ఫిర్యాదు చేశారని, వైద్యవిద్యార్థుల విషయంలో పనివేళలు ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్లేస్‌మెంట్‌కు అర్హత సాధించేందుకు కఠినాతికఠినమైన ప్రమాణాలు.. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన మిగిలిన అంశాలని తెలిపారు. రాష్ట్రాల యూనివర్సిటీల్లో సిబ్బంది కొరత కారణంగా బోధనాంశాల విషయంలో సరైన మద్దతు లభించడం లేదని, అరకొర ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ విద్యార్థులు డెంటల్, నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ రంగాల్లో ప్రాక్టీస్‌ చేయడం కష్టసాధ్యం చేస్తున్నాయని విద్యార్థులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement