ఇండియా కూటమి భేటీ నేడు | INDIA alliance meeting scheduled for September 30 | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి భేటీ నేడు

Sep 30 2026 4:42 AM | Updated on Sep 30 2026 4:42 AM

INDIA alliance meeting scheduled for September 30

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) పదవికి జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి బుధవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశమవుతోంది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాందీ, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, విపక్ష పార్టీల అగ్రనేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ, ఈసీల మధ్య భేదాభిప్రాయాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓట్ల గల్లంతు వివాదం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశ ఎజెండా మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, భారత ఎన్నికల సంఘంలో అంతర్గతంగా వ్యక్తమైన విభేదాల నేపథ్యంలో ఎన్‌డీఏ నేతృత్వంలోని మోదీ సర్కార్‌పై పోరాటాన్ని ఉధృతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి పక్షాలు ఈ అత్యవసర సమావేశంలో వ్యూహాలపై సమాలోచనలు జరపనున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన పదవి నుంచి దించాలని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన సమష్టి వ్యూహాన్ని ఈ సందర్భంగా పారీ్టలు రూపొందించనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement