ఈసీ వివాదం.. అదే డిమాండ్‌ చేసిన మహారాష్ట్ర సీఈవో! | ECINet Row: Maharashtra CEO Seeks More Freedom for Poll Officials | Sakshi
Sakshi News home page

ఈసీ వివాదం.. అదే డిమాండ్‌ చేసిన మహారాష్ట్ర సీఈవో!

Sep 29 2026 11:11 AM | Updated on Sep 29 2026 11:19 AM

ECINet Row: Maharashtra CEO Seeks More Freedom for Poll Officials

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో మహారాష్ట్ర నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది. ఓటర్ల వివరాల్లో సాఫ్ట్‌వేర్‌ గుర్తించే చిన్నపాటి వ్యత్యాసాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు మరింతగా ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్‌. చోక్కలింగం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే..

ఇందుకోసం ఈసీఐనెట్‌ సాఫ్ట్‌వేర్‌లో నాలుగు మార్పులు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ముఖ్యంగా ‘లాజికల్‌ డిస్క్రెపెన్సీ’గా గుర్తించిన కేసుల్లో.. ఓటరు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ERO) సంతృప్తి చెందితే, ఆ కేసును స్వయంగా పరిష్కరించే అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే అవసరమైన ఆధారాలు ఉన్నప్పుడు సంబంధిత ఓటరును వ్యక్తిగత విచారణకు పిలవకుండా మినహాయించే ఆప్షన్‌ కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో ఈఆర్వో వద్ద ఆధారాలు ఉన్నా.. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న పరిమితుల కారణంగా కేసును ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదే అంశం.. ఈసీ వివాదానికి కేంద్రబిందువు
మహారాష్ట్ర సీఈవో ఇప్పుడు లేవనెత్తిన అంశం ఇక్కడే కీలకంగా మారింది. ఎందుకంటే ఈఆర్వోల అధికారాలు, ఈసీఐనెట్‌లో వారి యాక్సెస్‌పై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి కూడా గతంలో పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, పేర్లు చేర్చడం, తొలగించడం, అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడం వంటి బాధ్యతలు చట్టపరంగా ఈఆర్వోలకే ఉన్నప్పటికీ.. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని నిర్ణయాలు లేదంటే మార్పులకు అవసరమైన యాక్సెస్‌ కేంద్రీకృత నియంత్రణలో ఉండటంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.

అసలు ఈసీఐనెట్‌ ఏం చేస్తోంది?
సర్‌లో ప్రస్తుత ఓటరు వివరాలను గత సర్‌లోని తల్లిదండ్రులు, తాతముత్తాతల వివరాలతో సాఫ్ట్‌వేర్‌ సరిపోల్చుతుంది. పేరు, వయసు వంటి వివరాల్లో తేడా కనిపిస్తే దాన్ని ‘లాజికల్‌ డిస్క్రెపెన్సీ’గా గుర్తిస్తుంది. అయితే ఇలాంటి మిస్‌ మ్యాచ్‌ రావడం అంటే ఆ వ్యక్తి ఓటరు కాదని తేల్చినట్లు కాదు. కేవలం పాత రికార్డులతో వివరాలు సరిపోలలేదన్నమాట.

ఇక్కడే ఈఆర్వోల పాత్ర కీలకం. ఓటరు ఇచ్చిన పత్రాలను పరిశీలించి, అవసరమైతే విచారణ జరిపి.. ఆ వ్యక్తి పేరు జాబితాలో ఉండాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన ఆప్షన్లు, యాక్సెస్‌ కూడా ఉండాలన్నది మహారాష్ట్ర సీఈవో తాజా డిమాండ్‌ సారాంశం.

అందుకే ‘ఫ్రీ హ్యాండ్‌’ డిమాండ్‌
మహారాష్ట్ర సీఈవో ప్రతిపాదన వెనుక ఉన్న అసలు విషయం ఇదే. సాఫ్ట్‌వేర్‌ ఒక వ్యత్యాసాన్ని గుర్తించడం ఒక అంశం. ఆ వ్యత్యాసానికి ఓటరు ఇచ్చిన వివరణ, పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మరో అంశం. రెండో విషయంలో ఈఆర్వోకు మరింత వెసులుబాటు ఉండాలని ఆయన కోరుతున్నారు. ఇదే అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా గతంలో ఈఆర్వోల చట్టపరమైన అధికారాలను సాఫ్ట్‌వేర్‌ పరిమితం చేయకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఈవో తాజా లేఖతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ఇప్పటికే కొన్ని మార్పులు
ఈ వివాదం నేపథ్యంలో సెప్టెంబర్‌ 26న ఎన్నికల సంఘం ఈసీఐనెట్‌పై సమీక్షకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే సర్‌ నోటీసులు అందుకున్నవారి విషయంలో విధానాన్ని సులభతరం చేసింది. అవసరమైన పత్రాలను బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వద్దే సేకరించి ఈసీఐనెట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని, సంతృప్తికరమైన పత్రాలు ఉంటే ఈఆర్వో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయించవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి అధికారులకు మరింత వెసులుబాటు అవసరమైతే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ఈసీ తెలిపింది.

అందుకే ఇప్పుడు మహారాష్ట్ర సీఈవో లేవనెత్తిన డిమాండ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్‌లో సాఫ్ట్‌వేర్‌ గుర్తించే మిస్మ్యాచ్‌ ఒకటైతే.. దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్వోది. ఆ నిర్ణయాన్ని తీసుకునేందుకు ఈఆర్వోకు సాఫ్ట్‌వేర్‌లో ఎంత స్వేచ్ఛ ఉండాలి? అనేదే ఈ మొత్తం వివాదంలో కీలకమైన ప్రశ్న.

ఇదీ చదవండి: సీఈసీకి చుక్కలు చూపించాలని నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement