ఎస్‌ఐఆర్, ఈసీ వ్యవహారంపై కీలక చర్చలు
ముఖ్యమంత్రులు, కమిటీ సభ్యులతో పాటు పార్టీల సీనియర్లకు పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం ‘ఇందిరాభవన్’లో జరిగే ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీ, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, పార్టీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కమిటీ సభ్యులతో పాటు సీనియర్ నేతల హాజరు కానున్నారు.
ఎన్నికల కమిషనర్ల మధ్య తలెత్తిన అభ్యంతరాలు, ఫామ్–6లో మార్పులు, ‘ఓటు చోరీ’ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. తదుపరి రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణకు సమావేశం దిశానిర్దేశం చేయనుంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సందూ, వివేక్ జోషి గత పది నెలల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. ఓటర్ల జాబితాల సవరణ, ఎస్‌ఐఆర్, ఓటర్ల నమోదుకు సంబంధించిన విధానాలు తదితర అంశాలు ఈ అభ్యంతరాల్లో ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకం
సీడబ్ల్యూసీ భేటీ అంశంపై ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇష్టారీతిగా ఎస్‌ఐఆర్ పేరిట ఓట్లను తొలగిస్తూపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎస్‌ఐఆర్ విషయంలో పార్టీ తీసుకోబోయే చర్యలు, వ్యూహాలపై మంగళవారం జరగబోయే సమావేశంలో పార్టీ ముఖ్యుల నుంచి సలహాలు,సూచనలు తీసుకుంటాం. ఎస్‌ఐఆర్ అంశంలో పోరాటం తీవ్రతరంకానుంది. ఈ అంశం యావత్ భారతదేశానికిది. ఇది ప్రజాస్వామ్యం ఉనికికి, దేశ అíస్తిత్వానికి సంబంధించిన అంశం. అందుకే ఈ అంశంలో ఇంత సీరియస్‌గా ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘంలో జరుగుతున్న అక్రమాలను స్వయంగా కమిషన్‌లోని వ్యక్తులే బట్టబయలుచేస్తున్నారు’’ అని ఖర్గే తెలిపారు. ‘‘జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేశాక కూడా ఆయనపై చర్యలకు పట్టుబడతాం’’అని ఖర్గే స్పష్టం చేశారు.
ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం
ఈ భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహా, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు తదితరులు మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నారు. పార్టీ భేటీకి సీనియర్ నేతలైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర నేతలను ఆహా్వనించారు.


