ముక్త(సరి) కంఠం! | Sakshi Editorial On Election Commission Issue | Sakshi
Sakshi News home page

ముక్త(సరి) కంఠం!

Sep 29 2026 3:02 AM | Updated on Sep 29 2026 3:02 AM

Sakshi Editorial On Election Commission Issue

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్, కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషిలు శనివారం సమావేశమై ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య విభేదాలున్నాయన్న కథనాలను తోసిపుచ్చారు. అలా ప్రకటించటానికి రెండు రోజులు పట్టిందంటేనే గృహచ్ఛిద్రాలు దండిగా వున్నాయని అర్థం. మీడియాతో నేరుగా మాట్లాడితే దొరికిపోతామన్న బెరుకు వారిలో ఉన్నదని తాత్పర్యం. దేశవ్యాప్తంగా ప్రజల్లో, పార్టీల్లో ఎన్నో సందేహాలూ, భయాందోళనలూ రేకెత్తించిన వ్యవహారం నాలుగు పేజీల ప్రెస్‌ నోట్‌తో, ముగ్గురు కమిషనర్ల గ్రూప్‌ ఫొటోతో సరిపెట్టుకోమంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. వ్యవస్థలు అంతర్గత కలహాల్లో కొట్టుమిట్టాడాలని ఎవరూ కోరుకోరు. కానీ మీడియా కథనాలకు స్పష్టమైన వివరణ ఉండాలా, వద్దా? పారదర్శకంగా, ప్రామాణికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ దాపరికంతో ఉందంటే దాని విశ్వసనీయత, కార్యకలాపాలూ ప్రశ్నార్థకం కావా? ఇద్దరు కమిషనర్లూ లేవనెత్తిన ప్రశ్నలు వారి వ్యక్తిగత తగవు కాదు. అది ఓటు హక్కు కోల్పోయిన కోట్లాదిమంది పౌరుల జీవన్మరణ సమస్యతో ముడిపడి వున్నది. ఈసీ వంటి ఒక కీలక వ్యవస్థలో నిబంధనలు బేఖాతరవుతూ ఇష్టారాజ్యం నడుస్తున్నదన్న అభిప్రాయం కలిగించిన ప్రశ్నలవి.

ఈసీ ప్రకటన తీర్చిన సందేహాలకన్నా, రేకెత్తించిందే అధికం. సంధూ, వివేక్‌ జోషిలిద్దరూ పది నెలల వ్యవధిలో ఏకంగా 14 సార్లు రికార్డుపూర్వకంగా అభ్యంతరం చెప్పారని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనం అంటున్నది. ఎందుకలా జరిగిందో, వారి అభ్యంతరాలేమిటో ఈసీ చెప్పొద్దా? ఈసీఐనెట్‌ పోర్టల్‌లో ఫామ్‌–6కి చేసిన సాంకేతిక మార్పులకు చట్టబద్ధత లేదంటూ వారిద్దరూ వేలెత్తిచూపారని కథనం. అది జరగనేలేదని ఈసీ ప్రకటన ఎక్కడా పేర్కొనలేదు. ఫామ్‌–6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ప్రకటన చెబుతోంది. అది బిహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) సాగుతున్న సందర్భం వరకూ వాస్తవం. కానీ అటుపై చేసిన మార్పులపై కదా రగడ! దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత లేదా? ఢిల్లీలో సాగిన ‘సర్‌’పై సమాచార హక్కు కార్యకర్త అంజలీ భరద్వాజ్, అమృత జోహ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై గత మంగళవారం విచారణ సందర్భంగా ఆ ప్రక్రియ యాంత్రికంగా సాగిందన్న అభిప్రాయం కలుగుతున్నదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడున్న 97 లక్షల మందికి పైగా ఓటర్లలో 47 లక్షలమంది పేర్లు జాబితాల నుంచి తొలగించారు. ఇందులో 33 లక్షలకుపైగా మందికి ‘తార్కిక వ్యత్యాసాల’ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. ఇదంతా ఈ ముగ్గురి సమష్టి నిర్వాకమో... లేక మీడియా కథనం అంటున్నట్టు మైనారిటీ నిర్ణయం పర్యవసానమో సంజాయిషీ ఇవ్వొద్దా? డేటా నిర్వహణ విషయంలోనూ, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి రాసిన లేఖ విషయంలోనూ ఇదే దాపరికం! 

జాతీయ మీడియాలో కథనాలు వెలువడి అల్లరైంది గనుక ఈమాత్రం వివరణైనా ఇచ్చారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్సార్‌సీపీ) ఫిర్యాదుచేసినా, ప్రతినిధి బృందం కలిసినా జవాబు లేదు. ఆ ఎన్నికలు ఆద్యంతమూ బరితెగింపే. ఎన్నికలకు ముందు కూటమి సలహాతో అధికారుల్ని మార్చడం మొదలుకొని వేకువజామువరకూ పోలింగ్‌ సాగటం, అర్ధరాత్రి లక్షలమంది ఓటేయటం, నిబంధనలకు విరుద్ధంగా వీవీ ప్యాట్‌ స్లిప్‌లు, సీసీ కెమెరా ఫుటేజ్‌లు ధ్వంసం చేయడంవరకూ ఈ దుర్నీతి యథేచ్ఛగా సాగింది. అదేమంటే మౌనమే సమాధానం. ఇందువల్ల టీడీపీ దండిగా లాభపడింది. అందుకే ‘ఎక్స్‌ప్రెస్‌’ కథనాల తర్వాత అపోహలు తొలగించాలంటూ ఒక మాయదారి ప్రకటన చేసి... ఈసీ ‘వివరణ’ వెలువడిన  మరుక్షణమే సందేహనివృత్తి అయిందంటూ ఆ పార్టీ కొనియాడింది. ఆ వివరణ రాజ్యాంగ సంస్థల నిజాయతీ, విశ్వసనీయతల్ని పునరుద్ఘాటించిందంటూ సీఎం చంద్రబాబు సిగ్గుమాలిన ప్రకటనొకటి చేశారు. అవేమిటో అంశాల వారీగా చెబితే అందరూ విని తరిస్తారు. మౌనంతోనో, అరకొర వివరణతోనో వంచించటం ఎల్లకాలమూ సాగదనీ, తీరు సరిగా లేనపుడు జనం నిలదీస్తారనీ ఈసీ తెలుసుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement