న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగా ప్రతిపాదించిన చర్యలు ఆ ప్రక్రియ ఒక వైఫల్యమేనని నిరూపిస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఓటు హక్కును కోల్పోతుండగా, ఎన్నికల సంఘం మాత్రం అరకొర చర్యలతో చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన ప్రకటన నష్ట నివారణకు చేసే ఒక నిస్సహాయ ప్రయత్నమేనని చెప్పారు.
తొలగించే జాబితాలో ఉన్న 5.43 కోట్ల మంది ఓటర్ల కోసం బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓ) ఇప్పుడు వారి ఇళ్లకు వెళ్తారని ఈసీ హామీ ఇచ్చిందని అన్నారు. బీఎల్‌ఓలు ఇప్పటికే ఇంటింటికీ వెళ్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని తేల్చిచెప్పారు. వారు ఓటర్ల ఇంటికి వెళ్తారన్న నమ్మకం లేదన్నారు. ఇప్పటివరకు దాదాపు 14 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఎన్నికల సంఘంపై జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఓటు హక్కు కోల్పోయినవారు మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఈసీ అధికారులపై మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా ఓటు హక్కును తొలగించి, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఏమిటని నిలదీశారు.
జ్ఞానేశ్ రాజీనామా చేయాలి: ప్రియాంక
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారని, ఆయన నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహించగలరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అందుకే జ్ఞానేశ్ తక్షణమే రాజీనామా చేఆయలని డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం కేరళంలో మీడియాతో మాట్లాడారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కేరళం మాజీ ప్రధాన కార్యదర్శి జి.జి.థామ్సన్‌ను జ్ఞానేశ్ కోరారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఎన్నికల వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అనైతికం అని తేల్చిచెప్పారు.
ఓటర్ల జాబితాను సరిచేస్తే భయమెందుకు?: బీజేపీ
ఎస్‌ఐఆర్ ప్రక్రియ కింద 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాల నుంచి కోటికి పైగా డూప్లికేట్ ఎంట్రీలు, 2.8 కోట్ల మంది మరణించిన ఓటర్ల పేర్లను తొలగించినట్లు బీజేపీ వెల్లడించింది. ఇన్నాళ్లూ తప్పుల తడకల ఓటర్ల జాబితాలతో లబ్ధి పొందిన వారే ఇప్పుడు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారని విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌పై పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
వివిధ ఎన్నికల్లో ఓటమికి అబద్ధాలతో కాకుండా, ప్రజాస్వామ్య తీర్పును గౌరవించి స్పందించాలని కాంగ్రెస్‌కు సూచించింది. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లతో ప్రయోజనం పొందింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలను సరిచేస్తే ఎందుకు భయపడుతున్నారని నిలదీసింది. ఓటర్ల జాబితాల నుండి 9.43 కోట్ల పేర్లను(అక్కడ నివసించని లేదా వేరే ప్రాంతానికి మారిన వారివి) గుర్తించి తొలగించినట్లు పేర్కొంది. ఓటర్ల జాబితాల ప్రక్షాళన ప్రక్రియను విపక్ష ‘ఇండియా’కూటమి ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని బీజేపీ ప్రశ్నించింది. ఓటర్ల జాబితా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించడం సరైంది కాదని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది తేల్చిచెప్పారు.


