ఈసీపై విపక్షాల ఉమ్మడి పోరు  | INDIA bloc parties likely to meet on September 30 over EC row | Sakshi
Sakshi News home page

ఈసీపై విపక్షాల ఉమ్మడి పోరు 

Sep 27 2026 5:46 AM | Updated on Sep 27 2026 5:46 AM

INDIA bloc parties likely to meet on September 30 over EC row

30న ఇండియా కూటమి కీలక భేటీ 

అక్టోబర్‌ 2న రాష్ట్రపతిని కలిసే అవకాశం 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ అంశంపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ఇండియా కూటమి పార్టీలు 30న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. ఈసీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, సర్‌ విషయంలో జారీ చేసిన ఆదేశాల విషయంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తో, ఇద్దరు ఈసీలు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి విభేదించారంటూ మీడియాలో వ చ్చిన కథనాలు తీవ్ర దుమారం రేపడం తెల్సిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

ఏకమైన వైరి పక్షాలు 
ఈసీ వ్యవహారంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల 29న సమావేశం కానుంది. మరుసటి రోజే ఇండియా కూటమి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఈసీ వైఖరి, సర్‌లో అవకతవకలు వంటి అంశాలపై ఉమ్మడి వైఖరి, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, న్యాయపరమైన మార్గాలపై ఈ పార్టీలు చర్చించనున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌తోపాటు సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)–లిబరేషన్‌ పార్టీలు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని ఇప్పటికే డిమాండ్‌ చేశాయి. ఈ విషయంలో జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్నారు కూడా. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తొలినుంచీ ఈసీ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఆమె కూడా ఇండియా కూటమితో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు. 

టీఎంసీ గుర్తింపు, పార్టీ గుర్తు విషయంలో ఏసీ ఏకపక్ష వైఖరిని ఆమె తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులైన టీఎంసీ, సీపీఎం ఈసీ విషయంలో ఒకే వైఖరితో ముందుకు రావడం మరో కీలక పరిణామం. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విపక్ష నేతలకు ఈసీ వ్యవహారంపై లేఖ రాయడంతోపాటు మమతా బెనర్జీతో మాట్లాడినట్లు సమాచారం. 

ఈ అంశంలో సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని మమత అంగీకరించినట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలుపార్టీలు ఈ అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా మారేందుకు ఇతర పక్షాలు సైతం సిద్ధమవుతున్నాయి. కూటమి భేటీ అనంతరం అక్టోబర్‌ 2న అంతా కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement