‘తొత్తు’ మారితే ‘విత్తు’ మారునా? | Sakshi Editorial On Election Commission Issue By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

‘తొత్తు’ మారితే ‘విత్తు’ మారునా?

Sep 27 2026 1:03 AM | Updated on Sep 27 2026 1:06 AM

Sakshi Editorial On Election Commission Issue By Vardhelli Murali

జనతంత్రం

కంచుకోట అనుకున్నాం. అలా అనుకోవాలని మీడియా శాసించింది. అది శత్రు దుర్భేద్యమని భజన గీతాలు పాడింది. జెన్‌ జీ యువతరం గురిచూసి పేల్చిన ఫిరంగి గుండు ధాటికి కోటలో కలవరం మొదలైంది. కాక్రోచ్‌ల దండు సింహాసనానికి ముచ్చె మటలు పట్టించింది. సరిగ్గా రెండు నెలలకే ఔర్‌ ఏక్‌ ఢక్కా. ఈ దెబ్బకు కోట కుతంత్రం సాక్ష్యాధారాలతో బట్టబయలైంది. మీడియా ప్రపంచంలో ఒకనాటి వైభవాన్ని కోల్పోయి, మిణుకు మిణుకుమంటున్న ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తాజా సంచలనానికి వాహకమైంది. రితికా చోప్డా అనే జర్నలిస్టు నెలల తరబడి శ్రమించి రాసిన పరిశోధన కథనం స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ హైజాకింగ్‌కు గురైన వైనాన్ని నగ్నంగా నిలబెట్టింది. ఒక భయ నిశ్శబ్దాన్ని కాక్రోచ్‌లు నిర్భయంగా ఛేదిస్తే, తన పరిశోధ నతో రితిక ఒక రణన్నినాదాన్నే ప్రజాస్వామిక శక్తులకు ప్రసాదించింది.

ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి, మీడియాను మచ్చిక చేసుకుంటే ఆడింది ఆట పాడింది పాట కాగలదని అధికారోన్మత్తులు భావిస్తే భంగపాటు తప్పదని ఈ పరిణామాలు నిరూపిస్తు న్నాయి. ఎవరూ ఊహించని సమూహాల నుంచి కూడా ప్రతిఘటనా శక్తులు ప్రభవించగలవని మరోమారు రుజువైంది. నవభారత నిర్మాత, పండిత నెహ్రూ, రాజ్యాంగ స్రష్ట బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మొదలైన స్వతంత్ర భారత తొలితరం నాయకులు వేసిన ప్రజాస్వామ్య పునాదులను కూలదోయడం అంత సులభం కాదు. మోదీ ‘మ్యాజిక్‌’తో కకావికలమై ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్నాయి. ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్నాయి. బెంగాల్‌లో మూడు దశా బ్దాల వైరాన్ని పక్కనపెట్టి తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇండియా కూటమి వెలుపల ఉన్న పార్టీలు కూడా ఐక్య ఉద్యమంలోకి కలిసి రావాలని కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలనేది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్‌. ఆయన రాజీనామా చేయకపోతే తొలగించాలని, ‘సర్‌’ కార్యక్రమాన్ని నిలిపివేయా లని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నది. పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి కూడా సన్నద్ధమయ్యారు. స్వతంత్రంగా వ్యవహరించవలసిన సీఈసీ వంటి అత్యున్నత పదవిలో జ్ఞానేశ్‌కుమార్‌ లాంటి అధికార పార్టీ తొత్తు కొనసాగడం వాంఛనీయం కాదు. అతనికి ఉద్వాసన పలకాలని కోరడం సమంజసమే. అతను తప్పుకున్న తర్వాత జరిగేదేమిటి? జ్ఞానేశ్‌ స్థానంలో శేషన్‌ రాడు కదా! రెండో జ్ఞానేశుడు వస్తాడు. విద్యామంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేస్తే ప్రహ్లాద్‌ జోషీ వచ్చాడు. ఇద్దరి మధ్యన సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు కదా!

ఎన్నికల కమిషనర్ల నియామకంపై 2023లో చేసిన సవరణ చట్టం ప్రకారం ప్రధాని, హోంమంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీ ఎన్నికల కమిషనర్‌లను నియమిస్తుంది. ఈ త్రిసభ్య సంఘంలో ప్రభుత్వానిదే మెజారిటీ. ఛీఫ్‌ ఎలక్షన్‌ కమిష నర్‌ స్థానం ఖాళీ అయినప్పుడు, ఉన్నవారిలో సీనియర్‌ను ఎంపిక చేయాలనే నిబంధనేమీ ఈ చట్టంలో లేదు. ఈ స్థానాన్ని కూడా ఎంపిక కమిటీ బయటి వ్యక్తులతో భర్తీ చేయవచ్చు. కనుక ఈ విషయంలో అప్రజాస్వామిక ధోరణికి మూలం భారత ప్రధాన న్యాయమూర్తి బదులు ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు మరో కేంద్రమంత్రిని చేర్చడం. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి సమస్యకు మూలమైన ఈ అంశాన్నే తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయ మూర్తితో కూడిన త్రిసభ్య ఎంపిక కమిటీని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానితో పాటు మరో కేంద్ర మంత్రిని నియమించుకోవడాన్ని ‘విద్యార్థే స్వయంగా తన ఎగ్జామినర్‌’ను ఎంపిక చేసుకోవడంగా ఆయన ఎద్దేవా చేశారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు కాకుండా, ఎన్నికల సంఘంలో వ్యక్తమైన అభ్యంతరాలేమిటి, వాటిపై తీసుకున్న చర్యలేమిటి అనేవి పారదర్శకంగా ప్రజలకు వెల్లడి కావాలని ఆయన కోరారు. 

ఈ వివాదంపై మిగిలిన ప్రతిపక్షాలకు భిన్నంగా జగన్‌ ఆచరణాత్మకమైన వైఖరి తీసుకున్నారు. జ్ఞానేశ్‌ను తొలగించాలి, అరెస్ట్‌ చేయాలనే ఉద్వేగపూరితమైన ధోరణి ప్రధాన ప్రతి పక్షంలో కనపడింది. జ్ఞానేశ్‌ వ్యవహారంపై విచారణ జరగ వలసిందే. దోషిగా తేలితే శిక్షపడవలసిందే. కానీ దానివల్లనే సమస్యను పరిష్కారం దొరకదు. జ్ఞానేశ్‌కుమార్‌ కేంద్రంలోని పెద్దల వద్ద భృత్యుడుగానే పనిచేశారు. తొత్తురాయుడిగానే విధేయత కనబరిచారు. అయితే ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయకపోవడం అనేది ఆయనతోనే ప్రారంభం కాలేదు. ఆ మాటకొస్తే ఎన్డీఏ హయాంలోనే మొదలుకాలేదు. ఏదో ఒక స్థాయిలో కేంద్ర కార్యనిర్వా హకవర్గం కనుసన్నల్లోనే ఎన్నికల సంఘాలు మొదటినుంచీ పనిచేశాయి. ఒక్క శేషన్‌ హయాంలో తప్ప. ఆ సమయంలో రుషితుల్యుడైన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నందువల్ల వ్యవస్థలన్నీ వాటి పరిధిలో స్వేచ్ఛగా పనిచేసుకొనే వెసులు బాటు కలిగింది. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రాజకీయపర మైన నిర్ణయాలన్నీ యూపీఏ చైర్‌పర్సన్‌ కనుసన్నల్లోనే జరిగేవి కనుక పీవీ హయాంతో పోల్చితే కొంత తేడా కనబడింది.

కేంద్ర సర్కార్‌లో సెక్రటరీ స్థాయిలో పనిచేస్తూ జ్ఞానేశ్‌ కుమార్‌ బీజేపీ పెద్దల నమ్మకాన్ని చూరగొన్నారని చెబుతారు. ఫలితంగా 2024 ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియమితు లయ్యారు. రాజీవ్‌ కుమార్‌ సీఈసీగా ఉన్నారు. జ్ఞానేశ్‌ ప్రవేశా నికి ఐదారు రోజుల ముందు మరో ఈసీ అరుణ్‌ గోయల్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన వ్యక్తిగత కారణాలని చెప్పినప్పటికీ అంతకుమించి ఏదో బలవత్కారణం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం ఉన్నది. గోయల్‌ రాజీనామాకు కొన్ని రోజుల ముందే మరో ఈసీ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. రాజీవ్‌తో పాటు గోయల్‌ ఒక్కరే ఈసీగా ఉన్నారు. నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు ఆ ఒక్కగా నొక్క ఈసీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ అత్యవసర సమయంలో ఆయన హఠాత్తుగా తప్పుకోవడం, జ్ఞానేశ్‌ కుమార్‌ అడుగు పెట్టడం రాజకీయ నిర్ణయాలేనని అధికార వర్గాల నిశ్చితాభిప్రాయం.

అప్పుడు సీఈసీగా ఉన్న రాజీవ్‌ కుమార్‌కు కూడా పాలక కూటమికి విధేయుడనే పేరున్నది. అతి విధేయుడైన జ్ఞానేశ్‌ కుమార్‌ ఆయనకు తోడయ్యారు. 2024 ఎన్నికల్లోనే చాప కింద నీరులా రహస్య ఎజెండా అమలైందన్న సంగతిని కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు పలువురు మేధావులు గుర్తించారు. వారి అనుమానాలను ఉటంకిస్తూ ఆధారాలతో కూడిన లేఖలను పంపించినా ఎన్నికల సంఘం నుంచి స్పందన రాలేదు. ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా విస్తృతంగా అధ్య యనం చేసి పోలైన ఓట్లపై ఎన్నికల సంఘం వేసిన పిల్లి మొగ్గల్ని ఎండగట్టి వాస్తవాలను జనం ముందుంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత భారీ స్థాయిలో ఓట్లు పడినట్టు వారం రోజుల తర్వాత ఈసీ ప్రకటించడాన్ని వీఎఫ్‌డీ ఎత్తి చూపింది.

ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.49 శాతం ఓట్ల పెరుగుదలలోని ఔచిత్యాన్ని వీఎఫ్‌డీ ప్రశ్నించింది. సాధారణంగా పోలింగ్‌ రోజు ప్రకటించే పోల్‌ శాతానికీ, మరుసటి రోజు తుది ప్రకటనకూ మధ్య ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండదు. కానీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో ఈ పెరుగుదల అసాధారణ స్థాయిలో ఉన్నది. ఒక్క ఏపీలోనే ఈ ఓట్ల పెరుగుదల 50 లక్ష లని ఆ సంస్థ లెక్క గట్టింది. ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ చేసిన పరిశోధన ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఏపీలోని 3,500 పోలింగ్‌ బూత్‌ లలో ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఈ బూత్‌లలో 5 గంటల నుంచి 8 గంటల మధ్య పడిన ఓట్లు 34 వేలు మాత్రమే. పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత, పోలింగ్‌ కేంద్రం ముందు క్యూలో నిలబడ్డ వారికి స్లిప్స్‌ పంచి ఓటు హక్కు కల్పిస్తారు. ఆ విధంగా 8 గంటల వరకు 34 వేల మంది (3,500 బూత్‌లలో) ఓట్లు వేశారనుకుందాం. హఠాత్తుగా రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటల మధ్య కనీవినీ ఎరు గని స్థాయిలో 17 లక్షల మంది ఓటేసినట్టు ఈసీ లెక్కలు చెబు తున్నాయని ప్రభాకర్‌ విశ్లేషించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వీవీ ప్యాట్లను కాల్చేయడం, కౌంటింగ్‌ రోజు దాకా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌ 90 శాతానికి పైగా ఉండటం వంటి అనుమానాలపై కూడా ఎన్నికల సంఘం స్పందించలేదు. నిస్సందేహంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తీర్పు అపహరణకు గురైంది. ఫలితాలు ప్రకటించిన తొలి రోజు నుంచే ప్రతిపక్షంపై రెడ్‌ బుక్‌ టెర్రర్‌ను ప్రయోగించి ఫలితాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాలను టీడీపీ ప్రారంభించింది. పోలింగ్‌ ముగిసిన సాయంత్రం నుంచే పోలీసు అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నల్లో పని చేయడం ప్రారంభించిందంటేనే ఎంత పథకం ప్రకారం ఈ ఓట్‌ చోరీ కుట్రను అమలు చేశారన్నది అర్థమవుతున్నది.

జ్ఞానేశ్‌ కుమార్‌ 2025 ఫిబ్రవరిలో ఛీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ అయ్యారు. అత్యంత వివాదాస్పదమైన ‘సర్‌’ ప్రక్రియకు ఆయనే శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఓటు హక్కు అనే రాజ్యాంగ ఆశ యాన్ని తుంగలో తొక్కి వీలైనంత మందిని ఓటు హక్కుకు దూరం చేసే అప్రజాస్వామిక విధానం ఆయన హయాంలో జరుగుతున్నది. ఇప్పటికి 13 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. ఈసీ తలతిక్క విధానాల వల్ల ఓటు హక్కు కోల్పోతున్న వారిలో ప్రధానంగా మైనారిటీలు, పేదలు, వలస కార్మికులు ఉంటున్నారు. అధికారంలో ఉన్న కూటమికి మేలు జరిగేలా సర్‌ ప్రక్రియను అమలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. పాలక పార్టీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్న జ్ఞానేశ్‌ తప్పుకోవలసిందే. అంతకంటే ముఖ్యమైనవి ఎన్నికల సంఘ వ్యవహారాల్లో పారదర్శకత, ఎన్నికల సంఘ సభ్యుల నియామకం ప్రజాస్వామికబద్ధంగా జరగడం. లేకపోతే ఒక తొత్తును మార్చినంత మాత్రాన అలాంటి మరో విత్తు మొల కెత్తకుండా ఉండదు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement