స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణలో చోటుచేసుకుంటున్న చిత్ర విచిత్ర విన్యాసాలు బయటపడుతూనే ఉన్నాయి. బిహార్‌లోనో, బెంగాల్‌లోనో, మరోచోటనో కష్టాలు పడటం సామాన్యుల వంతయింది. ప్రముఖులకు ఆ తాకిడి పెద్దగా లేదు. కానీ ఢిల్లీలో ఉంటూ రాజ్యంలోని వివిధ వ్యవస్థల్లో కీలకపాత్ర పోషించిన, పోషిస్తున్న వారికి కూడా చుక్కలు చూపించగలమని ఎన్నికల సంఘం (ఈసీ) రుజువు చేసింది. మాజీ ప్రధాని ఎల్.కె. అడ్వాణీ, ఆయన కుమార్తె, కోడలు, విదేశాంగ మంత్రి జైశంకర్, కాగ్ చీఫ్ కె. సంజయ్‌మూర్తి, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, బీఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్, సైనిక దళాల మాజీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, సెబీ చీఫ్ తుహిన్‌కాంత పాండేలకు నోటీసుల జారీ వైనం మీడియాలో మోతమోగుతోంది.
ఆఖరికి ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ సంధూ పేరు కూడా ఉందంటే ఈ ప్రక్రియ ఎంత దివ్యంగా సాగుతోందో అర్థమవుతుంది. వీరిలో 2002 నాటి సర్‌తో ‘మ్యాపింగ్’ కాలేదని కొందరికీ, పేర్లలో ‘తార్కిక వ్యత్యాసాలున్నా’యని మరికొందరికీ, మీకూ... మీ తండ్రికీ/తాతకూ మధ్య వయో భేదం ‘తక్కువుంద’ని ఇంకొందరికీ వర్తమానం పంపారు. సంధూ పేరును ఇప్పటికే చేర్చామని ఈసీ వివరణనిచ్చింది. ఆమధ్య భారతరత్న ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు సైతం తాఖీదు వచ్చిందని మీడియాలో ప్రముఖంగా రాగా, ఆయన పేరు అప్పటికే జాబితాలో చేర్చామని ఈసీ ఆదరాబాదరాగా జవాబిచ్చింది. మొన్న ఆగస్టు 31న ఢిల్లీకి సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన మూడు వారాలకు తాజా తాఖీదులు జారీ అయ్యాయి.
నోటీసులు అందుకున్న వారందరికీ ఆన్‌లైన్‌లో తప్పులు సరిచేసుకునే అవకాశా లిస్తున్నామని ఈసీ చెబుతోంది. వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చి మాట్లాడాకగానీ ఎవరి పేరూ తొలగించబోమని కూడా ఎంతో పెద్ద మనసుతో చెబుతోంది. మెచ్చుకోదగ్గ విషయమే. కానీ కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇంత పనికిమాలిన ప్రక్రియను కోట్లాది రూపాయలు వ్యయంచేసి, ఎందుకు అమలు చేస్తున్నట్టన్న సందేహం సంస్థ సారథులకే తడుతుంది. ప్రముఖులకు ఏమైనా జరిగితే ‘అయ్యో... ఇదేం చోద్యమ’నేవారు చాలా మందే ఉంటారు. మీడియాలో కావలసినంత రచ్చ జరుగుతుంది. కనుక డాక్టర్ సంధూ మాదిరే వీరిలో అందరికందరూ తుది జాబితాకెక్కుతారు. అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. మరి సామాన్యుడి గతేమిటి? సర్‌లో చోటు దొరక్కపోతే ఓటు కోల్పోవడం ఒక్కటే సమస్య కాదు. ఏదో ఒకరోజు మీరు ఈ దేశ పౌరులు కాదని అలాంటి వారందరూ వర్తమానం అందుకునే ప్రమాదం లేకపోలేదు.
పింఛన్ అందుకునే వారికి ప్రతియేటా ఒక తప్పనిసరి తంతు సాగుతుంటుంది. ‘లైఫ్ సర్టిఫికెట్’ పేరుతో ఎవరికి వారు తాము బతికేవున్నట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే తదుపరి నెల పింఛన్ అందుతుంది. అంటే ఏడాదిలో మిగతా 364 రోజులూ ఆ పేరుతో ఎవరు తీసుకున్నా పట్టించుకోరు. ఆ ఒక్కరోజూ మాత్రం ‘నిరూపించు కోవాలి’. సర్ ప్రక్రియ అందుకు భిన్నమేమీ కాదు. ఇంతకూ గతంలో ఉన్నత పదవుల్లో పనిచేసి నిష్క్రమించినవారికీ, ఆ పదవుల్లో కొనసాగుతున్నవారికీ ఈసీ నోటీసులిచ్చి అడగటం, ఆపై ఆ సంగతి మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చూడటంలోని మర్మమేమిటి? ‘మేం నిష్పాక్షికంగా ఉంటున్నాం. సాధారణ పౌరులైనా, మరొకరైనా మాకొకటే’ అని ప్రకటించుకోవటమేనా? ఆ మాటేమోగానీ సర్ ప్రక్రియ ప్రహసనం గమనించి, ఇందుకా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారన్న ప్రశ్న అయితే సాధారణ పౌరుల్లో తలెత్తుతుంది. ఢిల్లీ వరకూ చూసినా అక్కడ గత జాబితాలోని 33 శాతంమంది పేర్లు గల్లంతయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇతరచోట్లా 2024 నాటి ఎన్నికల్లో ఈవీఎంల లీలల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలూ, మేధావులూ ప్రశ్నిస్తున్నా గంభీర మౌన ముద్ర దాలుస్తూ, తప్పించుకు తిరుగుతున్న ఈసీ... ఈ దేవతా వస్త్రాల నేత పనిలో ఎందుకంత బిజీగా ఉంటున్నది? ఈసీ సారథులే చెప్పాలి. సర్ ప్రక్రియలో నిండా మునిగి, ఆ సంస్థ తన ఇతరేతర కర్తవ్యాల సంగతి ఎటూ వదిలేసింది. కనీసం ప్రజలకైనా వేరే పనులుంటాయని తోచొద్దా?


