‘నూరుశాతం’ తప్పుడు చర్య | Sakshi Editorial On US President Donald Trump | Sakshi
Sakshi News home page

‘నూరుశాతం’ తప్పుడు చర్య

Sep 18 2026 12:47 AM | Updated on Sep 18 2026 12:47 AM

Sakshi Editorial On US President Donald Trump

తీసుకునే నిర్ణయాలన్నీ వికటిస్తున్న వైనం కనబడుతూనే ఉన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు తత్వం బోధపడలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని నిలువరించే పేరిట ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించటానికీ... దాన్నుంచి ముడి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తూ ఆర్థికంగా తోడ్పడుతున్న భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు విధించటానికీ అనుమతించే బిల్లును ఆయన ప్రభుత్వం ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకుంది. గత నెల ఇదే బిల్లుకు సెనేట్‌ ఓకే చెప్పింది. తాజా ఆమోదంతో ఈ ఆంక్షల బిల్లుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ అంగీకారం తెలిపినట్టయింది. దీనిపై ట్రంప్‌ సంతకం చేశాక చట్టంగా మారుతుంది. ఆ అధికారాన్ని ట్రంప్‌ వినియోగిస్తారా లేదా అన్నది చూడాల్సివుంది. రెండోసారి అధికారంలోకొచ్చాక రష్యాపై ట్రంప్‌ విధించ దల్చుకున్న ఈ ఆంక్షలు అత్యంత కీలకమైనవి. ఈసారి ఆంక్షలన్నీ రష్యా ఇంధన, రక్షణ రంగాలే లక్ష్యంగా రూపొందించారు. 

తన అభీష్టానికి విరుద్ధంగా ఇరుగు పొరుగు దేశాలు నిర్ణయాలు తీసుకుంటే వాటితో ద్వైపాక్షిక వాణిజ్యంతోసహా వివిధ బంధాలన్నిటినీ తెంచుకోవటం ఏ ప్రభుత్వమైనా చేసే పని. కానీ ‘తన చావు జగత్ప్రళయమ’న్న రీతిలో ఆ పనే అందరూ చేసితీరాలనే డిమాండ్‌ మూర్ఖత్వం. అంతర్జాతీయంగా 80 ఏళ్ల క్రితం కుదిరిన ఒడంబడిక ప్రకారం దురాక్రమణ యుద్ధాలకు పాల్పడే దేశంపై ఎలాంటి చర్యలు అవసరమో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి నిర్ణయిస్తాయి. రష్యా తప్పు చేస్తున్నదని అమెరికా భావిస్తే ఆ వేదికలద్వారా ఒత్తిళ్లు తీసుకురావాలి. అలా చేయలేననుకుంటే తనవరకూ ఇష్టానుసారం చేసుకోవచ్చు. అసలు ట్రంప్‌ అత్యుత్సాహంతో అమలు చేస్తున్న సుంకాల విధానంపై అమెరికాలోనే ఏకాభిప్రాయం లేదు. రష్యాపై కఠిన చర్యల్ని సమర్థిస్తున్న డెమోక్రాట్లు సైతం ట్రంప్‌కు అతిగా అధికారాలు కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏకపక్ష అధికారాలు అప్పగిస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

మన దేశం గతంకన్నా దృఢంగా వ్యవహరించటం హర్షించదగ్గది. ప్రస్తుత విధానాన్ని విడనాడబోమనీ, మార్కెట్‌ చలనాలను నిర్దేశించే ధరవరలు, సరఫరా, డిమాండ్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భిన్న మార్గాల్లో చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తామనీ స్పష్టంచేసింది. వంద శాతం సుంకాలపై అమెరికా చర్యకు దిగితే ద్వైపాక్షిక సంబంధాలపై వాటి ప్రభావం పడుతుందని ఇప్పటికే అమెరికాకు తెలియ జేశామని తెలిపింది. అసలు ఈ తీర్మానం చేసే నైతిక హక్కు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఉందా? ఈ ఆంక్షలు ఒక్కరోజు ఆలస్యమైనా ఉక్రెయిన్‌లో మరింతమంది ప్రజలు మృత్యువుకు బలి అవుతారని తీర్మానం చెప్పడం వంచన. ఈ సూత్రం తనకు వర్తించదా? ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సాగించిన దురాగతాలను నిలువరించకపోగా, తానూ అందులో పాలుపంచుకుని దేశాధినేతతోసహా అనేకమంది పౌర, సైనిక ముఖ్యుల్ని హతమార్చటం... ఇప్పటికీ పౌర ప్రాంతాలపై బాంబులేస్తూ పదులకొద్దీ మందిని నిత్యం హతమార్చటాన్ని కాంగ్రెస్‌ ఎలా చూస్తుంది? తీర్మానం చేసేముందు తమ పాలకుడి నిర్వాక మేమిటన్న స్పృహ ఉండొద్దా? తాము అధర్మయుద్ధం కొనసాగిస్తూ ధర్మపన్నాలు వల్లించటం, వేరొకరిని వేలెత్తిచూపటం, అందరూ తననే అనుసరించాలనటం ఏం సబబు?

వచ్చేవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా సందర్శనకు రాబోతున్నారు. ఇరు దేశాలమధ్యా శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆంక్షల తీర్మానం తీసుకురావటం, బెదిరింపులకు దిగటం తెలివిమాలిన చర్యగా అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యకరం. ఇప్పటికే ఏఐ విషయంలో సమష్టిగా కదలాలన్న అమెరికా ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. ఆ విషయంలో ఇరు దేశాలమధ్యా భిన్నాభిప్రాయాలున్నాయని బయటపడింది. ఈ నేపథ్యంలో మరో వివాదాన్ని రగల్చటం వల్ల ఒరిగేదేమిటి? తన పెత్తందారీ పోకడలతో విసిగిన ప్రపంచం ఇప్పటికే దూరం జరిగిందని అమెరికా గ్రహించటం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడటంలో తెరవెనక తాను నడిపించిన ఎత్తుగడలే కారణమని గుర్తులేదా? అంతర్జాతీయ వేదికల ప్రమేయం లేకుండా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తేవటం చట్టవిరుద్ధమని అమెరికా తెలుసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement