అమెరికాలోని ఒహియోలో శిక్ష పడిన ఓ ఖైదీ కోర్టు నుంచి తరలిస్తుండగా చేతి సంకెళ్లను తెంచుకుని పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కోర్టు భవనం ప్రవేశద్వారం వరకు దాదాపు చేరుకున్న అతడిని చివరకు టేజర్‌తో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిఘా కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
వెల్స్‌విల్లేకు చెందిన 20 ఏళ్ల తిమోతీ రీగల్‌కు కొలంబియానా కౌంటీ కోర్టు తాజాగా ఏడాది జైలు శిక్ష విధించింది. దాడి, చోరీ సహా పలు అభియోగాల్లో అతడికి ఈ శిక్ష పడింది. శిక్ష అనంతరం రీగల్‌ను కోర్టు భవనంలోని ఓ మార్గం గుండా తీసుకెళ్తుండగా అతడు సంకెళ్లను తెంచుకున్నాడు. వెంటనే ఓ డిప్యూటీ అధికారి గొంతుపై పిడిగుద్దు కొట్టి అక్కడి నుంచి పరుగులు తీశాడు. మరో డిప్యూటీని కూడా కిందపడేశాడు. అనంతరం మెట్లపై నుంచి జారుతూ కిందికి వెళ్లి కోర్టు ప్రధాన ప్రవేశద్వారం వైపు దూసుకెళ్లాడు.
అతడు బయటకు వెళ్లేందుకు దాదాపు చేరుకున్న సమయంలో అధికారులు టేజర్ ప్రయోగించారు. దీంతో రీగల్ కిందపడిపోయి అదుపులోకి వచ్చాడు. మొత్తం ఘటన కోర్టు భవనంలోని నిఘా కెమెరాల్లో నమోదైంది. ఘటనలో ఖైదీ సంకెళ్లను ఎలా తెంచాడన్నది, అతడిపై ఇప్పటికే ఉన్న కేసులతో పాటు ఈ పరారీ ప్రయత్నానికి సంబంధించి తదుపరి చర్యలు ఏంటన్నది అధికారులు పరిశీలించనున్నారు.


