యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్‌లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్‌ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్‌ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!
సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్‌పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్‌కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది.
అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్‌ను తొలగించడంతో డ్రోన్‌కు ఆపరేటర్‌తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్‌ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్‌లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.
Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS
— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026
ఇదేం కొత్త కాదు!
ఉక్రెయిన్‌లో డ్రోన్‌లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్‌కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్‌ను విసిరి రష్యా డ్రోన్‌ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట!


