రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
రష్యాపై మరింత ఒత్తిడి
‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.
అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.
భారత్, చైనాలే ఎందుకు?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
అమెరికా మార్కెట్‌పై ప్రభావం?
భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.
ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలు
బిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.
ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠ
రష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్‌లు వేసేస్తారు!


