ఏఐ వాడకంపై సామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు! | AI Is Scary, OpenAI CEO Sam Altman Says The World Is Right To Fear The Growing Risks Of Powerful AI Systems | Sakshi
Sakshi News home page

ఏఐ వాడకంపై సామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు!

Sep 17 2026 11:18 AM | Updated on Sep 17 2026 11:25 AM

AI Is Scary: OpenAI CEO Sam Altman Says World Is Right to Be Afraid of AI

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI).. మనిషి జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీగానే ఇప్పటివరకు ఎక్కువగా కనిపించింది. కానీ అదే ఏఐ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదాలకు దారితీయొచ్చన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భయాలకు మరింత బలం చేకూర్చేలా ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భయపడటం తప్పేమీ కాదని.. నిజానికి అలా భయపడటానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన సేల్స్‌ఫోర్స్‌ డ్రీమ్‌ఫోర్స్‌ సదస్సులో ఆల్ట్‌మన్‌ ఏఐ భవిష్యత్తుపై మాట్లాడారు. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం గతంతో పోలిస్తే ఇప్పుడు సులభమైందని చెప్పారు. ‘‘ఏఐ విషయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుందో ఊహించడానికి ఇప్పుడు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. ప్రపంచం దీనిని చూసి భయపడటం సరైనదే’’ అని ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యానించారు.

అయితే అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరించగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఏఐ అభివృద్ధిలో భద్రత, మానవ విలువలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం.. వాటిపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఏఐకి ఇంత భయం ఎందుకు?
ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతుండటమే తాజా ఆందోళనలకు ప్రధాన కారణమని ఆల్ట్‌మన్‌ అభిప్రాయపడ్డారు. గతంలో ఏఐతో సాధ్యం కాదనుకున్న అనేక పనులను ఇప్పుడు అధునాతన మోడళ్లు చేయగలుగుతున్నాయన్నారు. మరింత శక్తిమంతమైన వ్యవస్థలు మనుషుల కంటే కొన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచే దిశగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. ఏఐ సంస్థలు మరింత శక్తివంతంగా మారితే ఆ టెక్నాలజీపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. శక్తిమంతమైన ఏఐ సంస్థలు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం చూపడం లేదా తమ అభిప్రాయాలను సమాజంపై ప్రభావితం చేసే స్థాయికి చేరడం వంటి ప్రమాదాలపై కూడా ఆల్ట్‌మన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదాలపై టెక్‌ దిగ్గజాల్లో చర్చ
ఏఐ భద్రతపై టెక్‌ పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌, ఆంథ్రపిక్‌ సీఈఓ డారియో అమోడీ లాంటివాళ్లు ఏఐ అభివృద్ధిలో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వేగాన్ని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని చెబుతున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు, నియంత్రణల అవసరంపై టెక్‌ పరిశ్రమలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. 

ఇటీవల ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా ప్రవర్తించిన కొన్ని ఘటనలు కూడా ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ, నియంత్రణలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చర్చిస్తున్నారు. 

భయం.. కానీ ఆపేయాలా?
ఏఐపై భయాలు పెరుగుతున్నప్పటికీ.. దాని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలా? లేదంటే భద్రతా ప్రమాణాలతో కొనసాగించాలా? అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్‌ కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వాలు ఈ విషయంలో వేర్వేరు విధానాలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆల్ట్‌మన్‌ తాజా వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐను అభివృద్ధి చేస్తున్న సంస్థలకే దాని ప్రమాదాలపై ఆందోళనలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడుతోంది. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీగా ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే సమయంలో దాని సామర్థ్యాలను బాధ్యతగా నియంత్రించడం కూడా అంతే కీలకంగా మారుతోంది.

ఇదీ చదవండి: ఏఐ స్లోకి ట్రంప్‌ భయపడుతున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement