మన దగ్గర పెళ్లి తంతు పూర్తవగానే.. కళ్లు చూసేది భోజనాల వైపే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా డైరెక్ట్‌గా భోజనానికి వెళ్లడానికి వీల్లేదు. డైనింగ్ రూమ్‌కి ముందుండే సెక్యూరిటీ గార్డు.. ద్వారపాలకుడిలా అమాంతంగా ఆపేస్తాడు. భోజనం చేయడానికి వీల్లేదని నిర్దయగా చెప్పేస్తాడు. ‘కానుక ఇచ్చుకో .. కంచం పుచ్చుకో’ అని హుకుం జారీ చేస్తాడు.
అదీనూ ఏదో ఒక గిఫ్ట్ కాదూ.. కచ్చితంగా క్యాషే ఇవ్వాలని ఆర్డర్ వేసేస్తాడు. క్యాష్ ఇచ్చి.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతనే టోకెన్ ఇస్తాడు. దక్షిణ కొరియాలో ఉన్న ఈ వింతైన వివాహ సంస్కృతి గురించి తాజాగా ఓ భారతీయ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కవర్‌లో క్యాష్ ఉంటేనే భోజనం అనే ఈ సంస్కృతిని కొరియన్‌ల భాషలో ‘చుగిగుమ్’ అని పిలుస్తారు.
పెళ్లికి వచ్చిన అతిథులు ముందుగా ఓ ప్రత్యేకమైన డెస్క్ వద్ద తమ క్యాష్ కవర్‌ను అందించి తమ పేరు నమోదు చేసుకుంటారు. ఆ తరువాతే వివాహ వేడుకలోపా ల్గొంటారు. అయితే ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది. గిఫ్ట్స్ రూపంలో కాకుండా డబ్బులు ఇవ్వడమే.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటకు తోడ్పాటునిస్తుందన్నదే ఆ ఆలోచన. అంటే వారిచ్చే డబ్బే వారి కొత్త ఇంటికి అవసరమైన వస్తువులు, ఇతర ఖర్చులు వంటి వాటికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
అందుకే తమకు నచ్చిన వస్తువు కొనడం కంటే, అవసరానికి తగ్గట్టు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం కొరియన్‌ల సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుగిగుమ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎవరు తమ పెళ్లికి ఎంత ఇచ్చారో గుర్తుంచుకోవడం. భవిష్యత్తులో అతిథుల ఇంట్లోనూ పెళ్లి జరిగినప్పుడు తగిన మొత్తంలో తిరిగి ఇవ్వాలనే సామాజిక ఆనవాయితీ కూడా ఉంది.
అయితే కాలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలో ఇప్పుడిప్పుడే మార్పులు ప్రారంభమయ్యాయి. అంటే డిజిటల్ పేమెంట్ల ద్వారా కూడా కానుకలు పంపే పద్ధతి నెమ్మదిగా విస్తరిస్తోందంట. ఏది ఏమైన ప్పటికీ ఈ గమ్మత్తైన ఆచారం వివాహం జరిపే కుటుంబాలకు, వివాహం చేసుకుంటున్న దంపతులకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తూ.. అండగా నిలుస్తోంది.
(చదవండి: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!)


