యువతకు స్ఫూర్తి
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్... ఈ ముగ్గురు మహానేతలు బ్రిక్స్ సమ్మిట్‌లో ఒక చోట ఉంటే మధ్యలో నిలుచున్న ‘నాల్గవ వ్యక్తి’ మన ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ బాబు. ఒకే ఒక్క విదేశీభాషపై పట్టు సాధించి...ఇవాళ గ్లోబల్ లీడర్ల పక్కన దౌత్యం నెరిపే స్థాయికి ఎదిగాడు. విదేశీ భాషలు నేర్చుకుంటే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చెప్పే సూపర్ సక్సెస్ స్టోరీ ఇది! యువతా... మీకెన్ని భాషలు వచ్చు?
‘చైనాను భారతీయులు, భారత్‌ను చైనీయులు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ రెండు వేర్వేరు సంస్కృతుల మధ్య భాషే వారధి. ఆ భాషతోనే మనం సంబంధాలు నెరపగలం’ అంటారు సిద్ధార్థ్ బాబు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఈస్ట్ ఏషియా డివిజన్’లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న సిద్దార్థ్ బాబు చైనా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, మంగోలియా తదితర దేశాలతో భారత్‌కు ఉన్న దౌత్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాదు, ఆ రాజ్యాధినేతలు వచ్చినప్పుడు ప్రధానికి అనువాదకునిగా కీలకమైన బాధ్యతను పోషిస్తుంటారు. ఆయన మాండరిన్ ఎక్స్‌పర్ట్. అందుకే బ్రిక్స్‌లో చైనా అధ్యక్షునికీ మన ప్రధానికీ మధ్య జరిగే సంభాషణల్లో కీలకంగా మారి ఇవాళ వార్తల్లో నిలిచారు.
ఎవరీ సిద్ధార్థ్ బాబు?
కేరళకు చెందిన సిద్ధార్థ్ బాబుది మామూలు మధ్యతరగతి కథే. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఒక ఈ–కామర్స్ కంపెనీలో రెండేళ్లు జాబ్ చేశారు. కానీ సంతృప్తి కలగలేదు. లైఫ్‌లో పెద్దగా సెటిల్ అవ్వాలనే కసితో సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2017లో ఆలిండియా 15వ ర్యాంక్ కొట్టి, ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఆప్షన్ ఎంచుకున్నారు. అయితే వృత్తిరీత్యా ఆయన నేర్చుకున్న ‘ఒక్క భాష’ ఆయన కెరీర్‌ను రాకెట్‌లా దూసుకెళ్లేలా చేసింది.
స్మార్ట్‌గా కొత్త భాష
కొత్త భాష నేర్చుకోవడం కష్టమనే అపోహ వద్దు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే కేవలం కొన్ని నెలల్లోనే కొత్త భాషపై పట్టు సాధించవచ్చు. భాషలు నేర్పించే డ్యుయోలింగో లాంటి యాప్స్ అనేకం ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 15 నిమిషాలు కేటాయించి బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఇక నేర్చుకోవాలనుకునే భాషలోని సినిమాలు, వెబ్ సిరీస్‌లను మొదట సబ్‌టైటిల్స్‌తో, ఆ తర్వాత సబ్‌టైటిల్స్ లేకుండా చూడటం ద్వారా ఉచ్చారణ సులువుగా అర్థమవుతుంది.
స్థానిక యూనివర్సిటీలు ఆఫర్ చేసే డిప్లొమా కోర్సుల్లో చేరడం ద్వారా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పొందవచ్చు. ‘ఒక మనిషితో అతడికి తెలిసిన భాషలో మాట్లాడితే అది అతడి మెదడుకు చేరుతుంది. అదే అతడి మాతృభాషలో మాట్లాడితే నేరుగా అతడి గుండెకు చేరుతుంది’ అంటాడు నెల్సన్ మండేలా. సిద్ధార్థ్ బాబు సరిగ్గా ఆ పని చేయడం ద్వారా ఎదిగారు. గ్లోబల్ సిటిజన్ గా ఎదగాలనుకునే యువత అదనంగా ఒక అంతర్జాతీయ భాషను నేర్చుకోవడం రెజ్యూమెకి బ్రహ్మాస్త్రాన్ని జోడించడమే. రీల్స్‌లో టైమ్ వృథా చేయకుండా ఇవాళే ఒక కొత్త భాష నేర్చుకోవడం స్టార్ట్ చేయండి.
‘మాండరిన్’ మంత్రం
ఐఎఫ్‌ఎస్ ట్రైనింగ్‌లో భాగంగా ఒక విదేశీ భాష నేర్చుకోవాలనేది రూల్. చాలామంది ఈజీగా ఉండేవి ఎంచుకుంటే సిద్ధార్థ్ మాత్రం ప్రపంచంలోనే కష్టమైన భాషల్లో ఒకటైన చైనీస్ ‘మాండరిన్’ ఎంచుకున్నారు. ‘చైనాను అర్థం చేసుకోవాలంటే ఆ దేశ భాష నేర్చుకోవడమే దారి’ అని గ్రహించి ఆ దారిలో వెళ్లారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో నాలుగేళ్లపాటు (2018–2022) పని చేస్తూ చైనా చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై లోతైన అధ్యయనం చేశారు. అయితే ఆయన అక్కడ ఉన్న కాలంలోనే కోవిడ్ చెలరేగింది.
ఆ మృత్యుఘోషలో లాక్‌డౌన్‌లో నాలుగు గోడల మధ్య ఆయన మాండరిన్ భాషలో మునిగి పోయి ఆరితేరారు. ఆ తర్వాత అమెరికాలో ట్రాన్స్ లేషన్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇవన్నీ ఆయనను ప్రధానికి వెన్నెముకగా మార్చాయి. రిపబ్లిక్ డే పరేడ్స్ నుంచి బ్రిక్స్ సమ్మిట్ వరకు... మోదీ వెనుక నీడలా ఉంటూ దేశ దౌత్యవిధానంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఒక భాషపై కమాండ్‌తో దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే స్థాయికి చేరాడాయన. ‘అయితే ఈ పని అంత సులువు కాదు. నేతలు మాట్లాడే సమయంలో వాటి గాంభీర్యం, లోతు తెలుసుకుని మనం అనువాదం చేయాల్సి వస్తుంది’ అంటారు సిద్ధార్థ్ బాబు.
గ్లోబల్ కెరీర్‌కు భాష కీలకం
మార్కులు, ర్యాంకుల పిచ్చిలో ఉన్న మన విద్యార్థులు, తల్లిదండ్రులు విదేశీ భాషలు నేర్చడం ఎంత ముఖ్యమో గ్రహించడం లేదు. గ్లోబలైజేషన్ పెరిగాక మాండరిన్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్... ఈ ఐదు భాషల్లో ఏదో ఒకటీ లేదా రెండు తెలిసిన వాళ్లకు ఇంటర్నేషనల్ కంపెనీలు, ఎంబసీలు, గ్లోబల్ ఆర్గనైజేషన్‌లు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. లక్షల్లో జీతాలు మాత్రమే కాదు, సిద్ధార్థ్ లాగా గ్లోబల్ స్టేజ్ మీద దేశ ప్రతినిధిగా నిలబడే అరుదైన గౌరవమూ దక్కుతుంది.


