'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం | Sakshi Guest Column On BRICS Summits at Delhi | Sakshi
Sakshi News home page

'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం

Sep 16 2026 12:17 AM | Updated on Sep 16 2026 12:17 AM

Sakshi Guest Column On BRICS Summits at Delhi

రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా

సందర్భం

ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సమావేశాలు ఏ విధంగా చూసినా ఘన విజయమే. ఈ మాట అనేందుకు గల కారణాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే, 20 ఏళ్ల క్రితం స్థాపితమై ఈసారితో కలిపి 18 శిఖరాగ్ర సమావేశాలు జరుపుకొన్న ఈ సంస్థ, తన ప్రకటిత లక్ష్యాల దిశగా ఇంతవరకెన్నడూ లేనంత పట్టుదలగా, ధైర్యంగా ముందడుగులు వేసింది. అందుకు కారణాలు రెండు: ఒకటి, వర్ధమాన దేశాలలో చైతన్యాలు, ఆత్మవిశ్వాసాలు, ఐక్యతలు పెరుగుతుండటం. రెండు, ప్రపంచంపై దశాబ్దాల పాటు ఆధిపత్యం సాగించిన అమెరికా నాయకత్వపు పాశ్చాత్య కూటమి క్రమంగా బలహీనపడుతుండటం.

ముఖ్యమైన ముందడుగులు
‘బ్రిక్స్‌’ వ్యవహరణలో ఈ మార్పు కనిపించటం రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన 16వ సమావేశాల (2024)లోనే మొదలై, బ్రెజిల్‌లోని రియో డి జనేరో (2025)లో కొనసాగింది. ఈ రెండింటికి మధ్య అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి బాధ్యతలు చేపట్టారు. తన కన్న ముందు జో బైడెన్‌ హయాంలోనే ఎదురవుతుండిన సమస్యల దృష్ట్యా ‘బ్రిక్స్‌’ నాయకులు కజాన్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనవి బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయబూనటం, ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకును, ఐఎంఎఫ్‌ను ప్రజాస్వామీకరించా లనే డిమాండ్, ‘బ్రిక్స్‌’ దేశాల మధ్య వాణిజ్యం డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలలో జరగాలనే ప్రతిపాదన. వీటిలో ముఖ్యంగా చివరి అంశం అపుడు పాశ్చాత్య లోకంలో ఆర్థికంగా, రాజకీయంగా కూడా పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా ఆధిపత్యానికి ఆయువుపట్లలో ఒకటైన డాలర్‌ రాజ్యం దెబ్బ తింటే మొదటికే మోసం రాగలదనుకున్న ట్రంప్, ‘బ్రిక్స్‌’ దేశాలు అటువంటి పని చేసినా, ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించినా అందరిపై 100 శాతం సుంకాలంటూ హెచ్చరించారు. నిజానికి డీ– డాలరైజేషన్, ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచనలు అపుడెంత మాత్రం లేవు. అది తేలికైన పని కాదు కూడా. అదే సమయంలో ఒక స్పష్టత అవసరం. డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలు అంతర్జాతీయ చెల్లింపుల కోసం అమెరికా నియంత్రణంలో గల ‘స్విఫ్ట్‌’ వ్యవస్థకు బదులు మరొకటి ఏర్పాటు చేసే యోచన, రిజర్వ్‌ కరెన్సీగా డాలర్‌కు బదులు చైనీస్‌ యువాన్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు మొద లైనవి క్రమంగా ముందుకు సాగిన కొద్దీ డాలర్‌ బలహీన పడుతుంది. వీటిలో స్థానిక కరెన్సీల ఉపయోగం ఇప్పటికే విస్తరిస్తూ డాలర్‌పై ప్రభావాన్ని చూపుతున్నది కూడా. అనగా, క్రమంగా డాలర్‌ బలహీనపడటమే పరోక్ష రీతిలో డీడాలరైజేషన్‌ జరగడ మన్నమాట. తక్కిన వాటిలో అదీ ఒక కరెన్సీగా మిగులుతుంది.

ఆకాశంలో సగం
ఢిల్లీ ‘బ్రిక్స్‌’ సందర్భంగా ఈ నేపథ్యాన్నంతా రాయటం ఎందు కంటే, కజాన్‌ నుంచే ఆరంభించి అమెరికా వైపు నుంచి ఎన్నెన్ని ఒత్తిడులు వచ్చినా, సంస్థ నాయకత్వం ఎంత మాత్రం జంకలేదు. సరికదా, స్థానిక కరెన్సీల చెల్లింపులను మరింత విస్తరించాలని ఢిల్లీ డిక్లరేషన్‌లో స్పష్టంగా తీర్మానించింది. బహుళ ధ్రువ ప్రపంచానికి తప్పనిసరి అవసరాలు మరికొన్ని కూడా ఉన్నాయిగాని, ధనం మూలం మిదం జగత్‌ అన్నట్లు బండికి ఆర్థికమే ఇరుసు గనుక, ‘బ్రిక్స్‌’ వైఖరిలోని ఈ కీలకాన్ని అర్థం చేసుకోవాలి. వార్తలకు అంతగా ఎక్కలేదు గానీ, ఢిల్లీ సమావేశాలకు ముందు రోజున ‘బ్రిక్స్‌’ దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వ్‌ బ్యాంకుల గవర్నర్లు ముంబైలో సమావేశమై, స్థానిక కరెన్సీలతో పాటు పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిలో దేశాల మధ్య చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ (స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయమనాలి) ఒకటి. అదిగాక, విచ్చలవిడి ట్యారిఫ్‌లను, డబ్ల్యూటీవోకు విరుద్ధమైన వాణిజ్య ఒప్పంద ధోరణులను, ధనిక దేశాల ప్రొటెక్షనిజాన్ని, ప్రపంచ బ్యాంకుపైన, ఐఎంఎఫ్‌పైన ఏకపక్ష నియంత్రణను తీవ్రంగా వ్యతిరే కించారు. తాము ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నారు.

చివరగా ఢిల్లీ డిక్లరేషన్‌ సరేసరి. సమావేశాలలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కొన్ని గణాంకాలను పేర్కొనటాన్ని కూడా ఈ ఆర్థిక సందర్భంలో గమనించాలి. బ్రిక్స్‌ దేశాల జనాభా ఇపుడు ప్రపంచ జనాభాలో సగమనీ, ప్రపంచ జీడీపీలో పాశ్చాత్య కూటమి జీ–7 వాటా 29 శాతం కాగా, ‘బ్రిక్స్‌’ది 40 శాతం అనీ, ‘బ్రిక్స్‌’ ఏర్పడిన గత రెండు దశాబ్దాలలో ఆ సంస్థ సభ్యుల జీడీపీ 4.5 రెట్లు పెరగగా, ప్రపంచానిది 2 రెట్లు మాత్రమేననీ చెప్పారు. అట్లా గుర్తు చేయటం పాశ్చాత్య దేశాలకేనని వేరే చెప్పనక్కర లేదు. గుర్తు చేయటం ఎందుకో కూడా అర్థం చేసుకోగలదే. సినిమా పరిభాషలో చెప్పాలంటే, ‘వస్తున్నాం కాస్కో, ఇకనైనా దారికి రా’ అనడమన్న మాట!

అందరితో కలిసి నడుస్తూ...
యథాతథంగానే ఒక స్థాయికి అభివృద్ధి చెందిన బ్రిక్స్‌ దేశాలకు, పాశ్చాత్య కూటమికి ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పరిణామాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. దీనికి తగినట్లు, కజాన్, రియో, ఢిల్లీ డిక్లరేషన్లలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండా లతో పాటు విశాల సముద్రాలలో గల చిన్న దేశాలు, పేద దేశాల సమస్యలు, అవసరాలు, ప్రాతినిధ్యాల గురించిన ప్రస్తావనలు అనేకం ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అత్యధిక దేశాలు, అత్యధిక జనాభాతో కూడిన లోకానికి ‘బ్రిక్స్‌’ ప్రజాస్వామికమైన రీతిలో ప్రాతినిధ్యం వహించనున్నదని చెప్పడమన్నమాట. ఈ రహస్యం ఆ యా దేశాలకు ఇప్పటికే చేరిపోయింది. కనుకనే ‘బ్రిక్స్‌’ పట్ల ఆసక్తి, అందులో చేరాలనే కోరిక, కజాన్‌ నుంచి పెరగగా, ఇపుడు ఢిల్లీ తర్వాత ఊపందుకోగలవని భావించవచ్చు.

ఇతర అంశాలలో వివిధ అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, బహుళ ధ్రువ  ప్రపంచ లక్ష్యాల కోసం ‘బ్రిక్స్‌’ డిమాండ్లు కజాన్‌ కన్న ఢిల్లీలో పదునెక్కాయి. ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, సైనిక రంగాలలో అంతర్జాతీయ నియమ నిబంధనల ఉల్లంఘనను మరింత తీవ్రంగా ఆక్షేపించారు. ఇరాన్, పాలస్తీనా, సిరియా, క్యూబా, జెరూసలేం స్వయంప్రతిపత్తి, శాంతియుత అణుపరిశోధనలకు మరింతగా మద్దతు ప్రకటించారు. మొదట అనుకున్నట్లు, బ్రిక్స్‌ శక్తిమంతమవుతుండటానికి గల రెండు కారణాలలో, ట్రంప్, ఆయనతోపాటు పాశ్చాత్య ప్రపంచం బలహీనపడుతుండటం ఒకటి. ఇంతకాలం లోకాన్ని ఏలినవారు, తిరుగు లేదన్నట్లు వీస్తున్న కొత్త గాలులను ఇప్పటికైనా గుర్తించి తమ ధోరణిని మార్చుకుంటూ తక్కిన ప్రపంచంతో సమానులుగా, సఖ్యతతో జీవించటం అందరికీ మేలు చేస్తుంది. లేని పక్షంలో, బ్రిక్స్‌ సమావేశాలు జరుగుతూ పోయినకొద్దీ అనివార్యపు మార్పులు తప్పవనాలి.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement