భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం, నీలాద్రిపేటకు చెందిన 29 ఏళ్ల ఆదివాసీ మహిళ మడివి ఉంగమ్మ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయంలో పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ ఎంతో అవసరం. కానీ ఉంగమ్మకు బర్త్ సర్టిఫికేట్ లేదు. ఆధార్ కార్డు లేదు. చిన్నతనంలో జనన నమోదు జరగకపోవడంతో ఏర్పడిన ఈ పత్రాల సమస్య ఇప్పుడు ఆమె గర్భధారణ సమయంలో అంగన్‌వాడీ సేవలకూ అడ్డంకిగా మారింది. ఫలితంగా పౌష్టికాహారం అందడం లేదు. ఈ ఒక్క ఘటన వెనుక మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లోని పౌర పత్రాల సమస్య ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, పినపాక మండలాల్లోని 16 గిరిజన అవాసాల్లో సుమారు 450 కుటుంబాలు, 2,500 మంది ప్రజలు నివసిస్తున్నారు. అంగేరిగూడెం, నీలాద్రిపేట, తీర్లాపురం, టేకులగూడెం, అశ్వాపురం పాడు వంటి గ్రామాల్లో నివసిస్తున్న వీరి సమస్యలు కొత్తవి కావు.
గర్భిణీ స్త్రీల నుండి పుట్టిన బిడ్డల వరకు ఆధార్ లేకపోవడం అనేక సమస్యలకు మూలంగా మారుతోంది. ఆధార్ లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు సమస్యతోపాటు ప్రాథమిక పాఠశా లల్లో ఆన్‌లైన్ నమోదు సమస్య కూడా ఏర్పడుతోంది. ఇది విద్యార్థి గుర్తింపునకు, పోషకాహారానికి, వైద్య సేవలకు, సంక్షేమ పథకాలకు అడ్డంకిగా మారుతోంది. ఒక గుర్తింపు పత్రం లేకపోవడంతో ఒక కుటుంబాన్ని ప్రభుత్వ వ్యవస్థ సంక్షేమ చట్రం నుంచి నెట్టేస్తోంది. ఆధార్ కార్డులు లేని కారణంగా కుటుంబాలు రేషన్ కార్డులు పొందలేకపోతున్నాయి. ఫలితంగా ఆహార భద్రతకు వారు దూరమవుతున్నారు.
‘అడవిలో నివసించే ఒక కుటుంబానికి మార్కెట్ ధరలకు ఆహారం కొనడం ఎంత కష్టం?’ అంటున్నారు సామాజిక కార్యకర్త తోలెం రమేష్. ఇది భద్రాచలం మన్యం కథ మాత్రమే కాదు, ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో నివసిస్తున్న ఆదివాసీల సమస్య కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు ప్రాంతాల్లో ఆధార్ కార్డులు లేక వందలాది గిరిజనులు భూమిపత్రాలు, ఇతర సంక్షేమ పథకాలు అందుకోలేక పోతున్నారు.
‘ఆధార్ లేక వృద్ధులకు పెన్షన్లు కూడా రావడం లేదు’ అంటారు పనసపుట్టు ఆవాసానికి చెందిన పాడి రాధ. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే, కమ్యూనిటీ గుర్తింపు పత్రాలు లేక కొందరు పిల్లలు పై చదువులకు వెళ్ల లేక, చదువు మధ్యలోనే ఆపి కూలీ పనులకు వెళ్తున్నారు.
పరిష్కార మార్గాలు
ప్రతి గిరిజన గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, జనన–మరణాల నమోదు అధికారులు కలిసి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. అక్కడే పాత జనన రికార్డులు పరిశీలించి, రికార్డులు లేని వారిని గుర్తించి, ఆలస్యంగా జనన నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించాలి. ఆధార్ నమోదు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పింఛను తదితర సమస్య లను గుర్తించి పరిష్కరించాలి. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లాలి.
ఇదీ చదవండి: వందేమాతరం.. అసలు అర్థం ఇదే!
‘పత్రాలు లేవు కాబట్టి వెళ్లండి’ అని చెప్పడం కాకుండా, ‘మీ దగ్గర ఏ పత్రం లేదు? దాన్ని ఎలా పొందాలో మేము మీకు సహాయం చేస్తాం’ అనే విధానం ఉండాలి. ఒక గ్రామానికి లేదా కొన్ని గ్రామాల సమూహానికి ఒక బాధ్యతగల అధికారిని నియమించి, ప్రజలకు అవసరమైన పత్రాలన్నీ పొందేలా సహాయం చేయాలి. మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించే వ్యక్తిని ఒక సర్టిఫికేట్ కోసం 30 నుండి 50 కిలోమీటర్లు ప్రయాణించమని చెప్పడం సులభం. కానీ అతని దగ్గర ప్రయాణ ఖర్చు ఉందా? రోజు వారీ కూలిపోతే కుటుంబం ఎలా నడుస్తుంది? ఒక వృద్ధ మహిళ నాలుగు కార్యాలయాలు తిరగగలదా? అందుకే పత్రాలు లేని ప్రజలకు ప్రభుత్వమే పత్రాలు అందించే వ్యవస్థ కావాలి. దశాబ్దాలుగా పత్రాలు లేకుండా జీవించిన ఆదివాసీ కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పరిష్కారం రూపొందించాలి. ప్రభుత్వ పథకాల జాబితాలో వారి పేర్లు ఉండటం మాత్రమే కాదు... ఆ పథకాల వెలుగు వారి జీవితాల్లోకి చేరాలి; అదే నిజమైన అభివృద్ధి.
– శ్యామ్ మోహన్
ఆదివాసీ జీవితాలపై పరిశోధన చేస్తున్న జర్నలిస్ట్


