బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, బీమా కంపెనీలు తమ మొబైల్ యాప్‌లలోనే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ను నేరుగా అనుసంధానించుకునేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (ఎస్‌డీకే)తో పాటు ప్రత్యేక శాండ్‌బాక్స్‌ను ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఈ ప్రకటన వెలువడింది.
ఈ కొత్త ఎస్‌డీకే వల్ల యూజర్లు వేర్వేరు యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా ఒకే బ్యాంకింగ్, బీమా లేదా బ్రోకింగ్ యాప్‌లోనే ఆధార్ ఫేస్ ధ్రువీకరణను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా ఫేస్‌ఆర్‌డీ(FaceRD) యాప్ అవసరమయ్యేది. ఇది వినియోగదారుల అనుభవాన్ని క్లిష్టతరం చేసేది.
యూఐడీఏఐ ఛైర్మన్ నీల్‌కంఠ్ మిశ్రా మాట్లాడుతూ.. కొత్త ఎస్‌డీకే ద్వారా భాగస్వామ్య బ్యాంకులు తమ సొంత సర్వర్లపైనే ప్రామాణీకరణ(అథెంటికేషన్)ను నిర్వహించుకోగలవని చెప్పారు. తద్వారా యూఐడీఏఐ కేంద్రాలపై భారం తగ్గడంతో పాటు భద్రత మెరుగవుతుందని తెలిపారు. ప్రతిరోజూ వందలాది సైబర్ దాడులు జరుగుతున్నా తగిన భద్రతా చర్యలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు జరుగుతుండగా, భవిష్యత్తులో 25-30 కోట్లకు చేరుకునేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్టు మిశ్రా చెప్పారు.
కొత్త ఎస్‌డీకేలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్‌నెస్ డిటెక్షన్, స్పూఫింగ్ నిరోధక సామర్థ్యాలు ఉన్నాయి. దీంతోపాటు ఆవిష్కరించిన శాండ్‌బాక్స్ ద్వారా బాహ్య బయోమెట్రిక్ హార్డ్‌వేర్ అవసరం లేకుండానే డెవలపర్లు యూజర్ ప్రొవిజనింగ్, ఫేస్ క్యాప్చర్, లైవ్‌నెస్ చెక్‌లు, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి దశలను పరీక్షించవచ్చు.
2021లో ప్రారంభమైన ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ఇప్పటివరకు 500 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. జీవన్ ప్రమాణ్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల్లో వినియోగిస్తున్నారు. అదనంగా, బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి మార్గదర్శకంగా ఈజ్ ఆఫ్ ఆన్‌బోర్డింగ్ ప్లేబుక్‌ను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్‌పై వీసా మోసం ఆరోపణలు


