యాప్‌లోనే ఆధార్‌కు కొత్త ఫోన్‌ నంబర్‌ లింక్‌ | Mobile number in Aadhaar using Aadhaar App | Sakshi
Sakshi News home page

యాప్‌లోనే ఆధార్‌కు కొత్త ఫోన్‌ నంబర్‌ లింక్‌

Aug 23 2026 5:19 AM | Updated on Aug 23 2026 5:19 AM

Mobile number in Aadhaar using Aadhaar App

ప్రక్రియను సరళతరం చేసిన యూఐడీఏఐ

అయితే ఇప్పటికే ఉన్ననంబర్‌ మనుగడలో ఉండాలి

లేకుంటే ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందే  

సాక్షి, అమరావతి : ఆధార్‌ కార్డుకు కొత్తగా వేరొక ఫోను నంబరును అనుసంధానం చేసుకునే ప్రక్రియను ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ పూర్తిగా సులభతరం చేసింది. ఇంతకు ముందు కేవలం ఆధార్‌ సర్వీసు సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఈ సేవను కొత్తగా మొబైల్‌లోనే పొందేలా ఆధార్‌ యాప్‌ను ఆధునికీకరించింది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకు సేవల సహా అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఆధార్‌కార్డుతో అనుసంధానమై కొనసాగుతుండడంతో మొబైల్‌ నంబరుకు వచ్చే ఓటీపీ చాలా కీలకంగా మారిన విషయం తెలిసిందే. అయితే, దాదాపు 17 ఏళ్ల క్రితం మొదలైన ఆధార్‌ కార్డు నమోదు సమయంలో అప్పట్లో కుటుంబం సభ్యులందరి ఆధార్‌కార్డులకు ఆ కుటుంబ పెద్ద పాత ఫోనునంబరు నమోదై ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

దీంతో ఆధార్‌కు కొత్త ఫోన్‌ నంబర్‌ అనుసంధానానికి  గతంలోనే అనుమతించిన యూఐడీఏఐ ఈ సేవను ఇప్పటివరకు కేవలం ఆధార్‌ సెంటర్లకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో ఆధార్‌కార్డు దారులు ఫోన్‌ నంబర్‌ అనుసంధానానికి తప్పనిసరిగా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల తరబడి క్యూలో నిలబడి నంబర్‌ అనుసంధాన ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి వచ్చేది. 

అయితే ఇకపై కొత్త నంబర్‌ అనుసంధానానికి అధార్‌ కేంద్రానికి పని వెళ్లకుండా మొబైల్‌ యాప్‌లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ కల్పించింది.  దీనికోసం  ఈ ఏడాది జనవరి–26 నుంచి ఆధునికీకరించిన ఆన్‌లైన్‌ ‘ఆధార్‌ యాప్‌’ను అందుబాటులోకి తీసుకొచి్చంది. అంతకు ముందు ఉండే ‘ఎంఆధార్‌ యాప్‌’లో కూడా ఈ సేవ అన్‌లైన్‌లో అందుబాటులో లేదు.  

ఇప్పటికే లింకైన ఫోన్‌  నంబర్‌ ఉంటేనే..! 
ప్రస్తుతం ఆధార్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ పని చేస్తున్నట్లయితే మీరు ఆధార్‌ యాప్‌ ద్వారా కొత్త మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ నంబర్‌ గుర్తు లేకపోవడం లేదా మనుగడలో లేకపోయినట్లయితే కొత్త మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయడం కోసం ఆధార్‌ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  

యాప్‌ ద్వారా కొత్త ఫోన్‌ నంబర్‌ అనుసంధానం ఎలాగంటే..  
స్టెప్‌ – 1
మొబైల్‌ ఫోనులో గుగూల్‌ ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా కొత్త ఆధార్‌ యాప్‌ను(ఏఏడీహెచ్‌ఏఏఆర్‌)డౌన్‌లోడ్‌ చేసి, ఆపై ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 
 తరువాత ఈ యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. ఇందుకోసం ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

 ఆ తరువాత ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా యాప్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చు. ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా ఒకసారి లాగిన్‌ అయితే ఇక ఆ మొబైల్‌లో ప్రత్యేక పిన్‌ నెంబరు లేదా బయోమెట్రిక్‌ ద్వారా నిరంతరం యాప్‌ను వినియోగించుకోవచ్చు.  
  యాప్‌ లాగిన్‌ అయిన తరువాత యాప్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. సర్వీసెస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత అక్కడ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.  

స్టెప్‌ – 2
  ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేయడానికి కొనసాగించు (కంటిన్యూ) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 
 ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకుంటున్న మీ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. 
 ఇప్పుడు ఎంటర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది, దానిని అక్కడ 
ఎంటర్‌ చేయాలి.

స్టెప్‌ – 3
  ఇప్పుడు మరోసారి మరో విడత ఫేస్‌ రికగి్నషన్‌ చేసుకోవాలి. 
 ఆ తర్వాత రూ.75 ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించాలి. 
 ఫీజు చెల్లింపు చేసిన తర్వాత సమర్పించండి(సబ్‌మిట్‌) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 
 ఈ ప్రక్రియ పూర్తయిన️15 –20 రోజుల్లోగా కొత్త మొబైల్‌ నంబర్‌ ఆధార్‌లో అప్‌డేట్‌ అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement