తల్లి వయస్సులో ఉన్న గుండ లక్ష్మీదేవిని అనుచితంగా సంబోధించడం సంస్కారమా?
‘అమ్మా నువ్వు సానుభూతితో పాకం తీయాలి అనుకుంటే... అందులో బకెట్ నీళ్లు పోస్తానని గుర్తించలేకపోతున్నావ్’ అని అంటే అహంకారం కాదా.
మరణించిన గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహం కోసం దిమ్మెలను నిర్మిస్తే.. వాటిని కూల్చేయడం రాజకీయ కక్ష కాదా?
కూటమి సర్కారుకు సగటు సిక్కోలు వాసి సంధిస్తున్న ప్రశ్నలివి. శ్రీకాకుళం రాజకీయాల్లో నిజాయితీకి, ప్రజా సేవకు మారుపేరుగా నిలిచిన గుండ కుటుంబానికి నేడు అడుగడుగునా అవమానాలు, కన్నీళ్లే మిగులుతుంటే నగరవాసులకు కడుపు తరుక్కుపోతోంది. ఎన్నికల వేళ గుండ లక్ష్మీదేవిపై టీడీపీ నేతలు మానవత్వం మరిచిపోయి చేస్తున్న వ్యాఖ్యలు సిక్కోలు వాసులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ప్రజలు మన్నన పొందిన నేత గుండ అప్పల సూర్యనారాయణకు చివరి రోజుల్లో సొంత పార్టీ నుంచే ఎదురైన అవమానాలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కనీసం అధిష్టానం వద్ద మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడు లేక ఆయన లోలోపలే కుమిలిపోయారు. వాడుకున్నంత కాలం వాడుకుని, వదిలేశారే అన్న ఆవేదనే ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసిందని, మానసిక క్షోభే ఆయన్ను బలి తీసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మహిళ అని చూడకుండా..
భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, నిత్యం ప్రజల మధ్యే ఉండే గుండ లక్ష్మీదేవిని లక్ష్యంగా చేసుకుని కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నగరవాసులను తీవ్రంగా బాధించాయి. ఒక మహిళ, అందులోనూ ఆదర్శవంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని కూడా చూడకుండా కించ పరిచేలా మాట్లాడటంపై సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో వారు చేస్తున్న విమర్శలను భరిస్తూ, మౌనంగా ఆమె పడుతున్న ఆవేదన చూసి ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు.
విగ్రహం పెట్టేందుకు కూడా కక్ష సాధింపా?
ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోయినా, పార్టీ ఆదేశాలకు తలవంచి ఎంతో హుందాగా వ్యవహరించిన ఆ కుటుంబానికి, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస గౌరవం దక్కుతుందని అంతా భావించారు. కానీ, మరణించిన ఆ సీనియర్ నేత స్మృత్యర్థం నగరంలో ఓ విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు కూడా సొంత పార్టీ నేతలే అడ్డు పడటం అందరినీ కలిచి వేసింది. వారి వెంట నడుస్తున్న కార్యకర్తలపైనా ఒత్తిడి రావడం కుంగదీసేలా చేసింది. పార్టీ కోసం ప్రాణాలు అరి్పంచిన నాయకుడి విగ్రహానికి సొంత గడ్డపై అవమానపరడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార, ధనబలంతో ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని ఒంటరి చేయాలని చూస్తున్న వారి తీరుపై శ్రీకాకుళం ప్రజల్ని కలిచి వేయడమే కాకుండా ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమని చెబుతున్నారు.
అనుభవం ఉన్న నేత పోటీ చేయకూడదా..?
ఎంతో అనుభవం ఉంది. నమ్ముకున్న పార్టీ మోసం చేసింది. ప్రజా సేవ చేయడానికి ఆదరించిన వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తుంటే టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు. ఆమె ఏకంగా రాజకీయాల్లో ఉండకూడదనేలా వ్యవహరిస్తున్నారు. భర్త రాజకీయాల్లో ఉన్నప్పుడు గృహిణిగా, తెరవెనుక మద్దతుదారుగా ఉన్న లక్ష్మీదేవి ఆ తర్వాత అంచలంచెలుగా కౌన్సెలర్‌గా, శ్రీకాకుళం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా తన రాజకీయ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రజా సమస్యలపై ఆమెకున్న అవగాహన, ప్రజలతో మమేకమయ్యే తీరు ఆమెను సమర్థమైన నాయకురాలిగా నిలబెట్టాయి. అలాంటి మహిళను టార్గెట్ చేసి, ఎన్నికల వేళ కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నాయకుల ప్రవర్తనను నగర ప్రజలు గమనిస్తున్నారు.


