నీళ్లెత్తమంటే దుమ్మెత్తిపోస్తున్నారు! | Harish Rao Open Challenge to Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

నీళ్లెత్తమంటే దుమ్మెత్తిపోస్తున్నారు!

Nov 25 2026 5:14 AM | Updated on Nov 25 2026 5:14 AM

Harish Rao Open Challenge to Revanth Reddy: Telangana

నదీ జలాల విషయంలో బీఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు సీఎం విఫలయత్నం 

మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు ఫైర్‌ 

తెలుగుదేశం పార్టీ కట్టుబానిస రేవంత్‌కు తెలంగాణ నీటి హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదు 

పల్నాడు పథకంపై వెనుక తేదీలతో లేఖలు రాసి తప్పించుకునే యత్నం 

కృష్ణా నీళ్లు 299:512 చొప్పున పంపకాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణం 

అసెంబ్లీలో చర్చకు రేవంత్‌ సిద్ధమా? అంటూ హరీశ్‌రావు సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: నదీ జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలతో బీఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నాడని, నీళ్లు ఎత్తమంటే దుమ్మెత్తిపోస్తూ అతి తెలివితేటలు చూపుతున్నాడని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్‌ నోరు పెంచి తమపై నిందలు వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కాబోవన్నారు.

తెలంగాణ కోసం ఉద్యమించి ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను ఉరి తీయాలంటున్న తెలుగుదేశం పార్టీ కట్టుబానిస రేవంత్‌కు తెలంగాణ నీటి హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో నోట్ల కట్టలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం

విడ్డూరంగా ఉందన్నారు. ‘నదీ జలాలపై అసెంబ్లీ పెట్టండి.. మైకులు కట్‌ చేయకుండా వారం, పది రోజులైనా చర్చకు సిద్ధం. అన్నం తినకుండా అయినా మాట్లాడతాం. చర్చకు రేవంత్‌ సిద్ధమా?..’అని సవాల్‌ చేశారు. నదీ జలాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

2022 నాటి జీవోలో ఆ ప్రస్తావనే లేదు.. 
    ‘అబద్ధాలకు అంగీ, లాగు వేస్తే రేవంత్‌రెడ్డి అవుతారు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌లో అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి తిప్పలు పడుతున్నారు. వాస్తవాలను దాచిపెడుతున్నారు. 2025 జనవరిలోనే ఈ పథకానికి టెండర్లు పిలిచినా ప్రభుత్వం స్పందించలేదు.

కానీ బీఆర్‌ఎస్‌ నేతలు ఆధారాలతో ప్రశ్నించిన తర్వాత పాత తేదీలతో లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. 2022 నాటి జీవోలో నాగార్జునసాగర్‌ నుంచి పల్నాడుకు తాగునీరు తీసుకునే ప్రస్తావనే లేదు. రేవంత్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 453, 458 జీవోల్లో మాత్రం సాగర్‌ నుంచి 1.865 టీఎంసీల నీటిని తీసుకునే అంశం స్పష్టంగా ఉంది. జీవో 483లో ఎన్‌ఎస్‌పీ ఓబీసీ (ఒంగోలు బ్రాంచ్‌) కెనాల్‌ ప్రస్తావన ఉంటే సీఎం నాగార్జునసాగర్‌ అంటూ వక్రీకరిస్తున్నాడు.  

కేఆర్‌ఎంబీ సమావేశంలో ఎందుకు ప్రస్తావించలేదు? 
    సోమవారం జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో పల్నాడు అంశంపై తెలంగాణ ఇంజినీర్లు ఎందుకు ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలి. ఏడాది కాలంగా ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం విడ్డూరం. 

గతంలో కూడా బనకచర్ల, గోదావరిపై ఏడు ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదనల విషయంలోనూ బీఆర్‌ఎస్‌ పోరాటం చేసిన తర్వాతే ప్రభుత్వం పాత తేదీలతో లేఖలు రాసింది. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కుంభకర్ణ నిద్రపోయారు. అసలు వారిని ఉరి తీయాలి..’అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

50:50 నిష్పత్తి కోసం 30కి పైగా లేఖలు రాశాం 
    ‘కృష్ణా జలాలు 299:512 టీఎంసీల చొప్పున వాటాకు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీ పాలకులే కారణం. శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదిక, విభజన బిల్లులోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ కేటాయింపులను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే కేసీఆర్‌ కేంద్రాన్ని ఆశ్రయించి తెలంగాణకు అదనంగా 581 టీఎంసీల అవసరాన్ని వివరించి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. 

2015లో కుదిరిన 299:512 ఒప్పందం శాశ్వతమైనది కాదని, ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చేవరకు తాత్కాలికంగా 50:50 నిష్పత్తిలో నీళ్లు వినియోగించాలని 30కి పైగా లేఖలు రాశాం. రాయలసీమ ఎత్తిపోతలపై 2020 జనవరి 20నే కేఆర్‌ఎంబీకి లేఖ రాయడంతో పాటు జీవో వచ్చిన తర్వాత కూడా వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం 19 లేఖలతో పాటు అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ పోరాడి జోగుళాంబ బరాజ్‌కి ఉత్తర్వులు ఇచ్చాం. 

పోతిరెడ్డిపాడు విస్తరణపై 2005లో 26 మంది ఎమ్మెల్యేలతో 42 రోజులపాటు అసెంబ్లీని స్తంభింపజేసి పోరాడాం. మేము మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు మంత్రి పదవుల కోసం మౌనంగా ఉన్నారు..’అని హరీశ్‌ విమర్శించారు. 

పాలమూరుకు ద్రోహం.. కుప్పానికి నీళ్లు 
    ‘ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ మూడు దశాబ్దాల పాలనలో 30 వేల ఎకరాలకే సాగునీరు అందిస్తే.. కేసీఆర్‌ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3లో రెండు మూడు కిలోమీటర్ల పనులు పూర్తిచేస్తే 50 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా రేవంత్‌ పాలమూరుకు నీళ్లివ్వడం లేదు. 20 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్‌.. కనీసం ఐదు శాతం కూడా అమలు చేయలేదు.

బీఆర్‌ఎస్‌ హయాంలో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి 47 లక్షల ఎకరాలకు నీరందించాం. బీఆర్‌ఎస్‌ హయాంలో 218 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే కాంగ్రెస్‌ మూడేళ్ల పాలనలో ఒక్క టీఎంసీ సామర్థ్యం ఉన్న కొత్త రిజర్వాయర్‌ కూడా కట్టలేదు. కాళేశ్వరం మూడో డీపీఆర్, సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి.

దేవాదుల, సీతారామ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలి..’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సమావేశంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement