ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగిస్తారా? | Telangana LRS: Why 2 Lakh Applications Are Stuck | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ ఎప్పుడో?

Nov 24 2026 7:57 PM | Updated on Nov 24 2026 8:01 PM

Telangana LRS: Why 2 Lakh Applications Are Stuck

క్షేత్రస్థాయి తనిఖీల్లో తీవ్ర జాప్యం 

హెచ్‌ఎండీఏలో పేరుకుపోతున్న పెండింగ్‌ ఫైళ్లు

వివిధ దశల్లో సమన్వయ లేమి

ఇప్పటి వరకు ఆమోదం పొందినవి 36,819

పెండింగ్‌లో 2 లక్షల పైచిలుకు దరఖాస్తులు

సాక్షి, హైద‌రాబాద్‌: ఏళ్లు గడిచినా అక్రమ స్థలాల క్రమబద్ధీకరణ పథకానికి మోక్షం లభించడం లేదు. లక్షల్లో దరఖాస్తులు ఉంటే కేవలం వేలల్లో మాత్రమే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌–2020 పథకం కింద దరఖాస్తు చేసుకున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్లాట్‌లకు కేవలం ఒకటి, రెండేళ్లలో రెగ్యులరైజేషన్‌ పూర్తికావలసి ఉండగా, ఆరేళ్లు గడిచినా పరిస్థితి మారలేదు. క్యూర్‌ పరిధిలో మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని చేపట్టారు. వివిధ వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.

గ్రామపంచాయితీలు, అక్రమ లే అవుట్‌లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే సుమారు 2,73,122 దరఖాస్తులు పరిశీలనకు వచ్చాయి. కానీ ఈ ఆరేళ్లలో అన్ని విధాలుగా అనుమతులు పొందినవి మాత్రం 36,819 కావడం గమనార్హం. సాంకేతిక చిక్కుల వల్ల కొన్ని, క్షేత్రస్థాయిలో వివిధ విభాగాల మధ్య సమన్వయలేమి వల్ల మరికొన్ని పెండింగ్‌లో  పేరుకుపోతున్నాయి.

ఎక్కడివక్కడే.. 
ఈ పథకం నత్తనడకన సాగుతూండడంతో ప్రభుత్వం ఏటేటా పొడిగింపును కొనసాగిస్తుంది. ఆరేళ్ల క్రితం అమల్లోకి తెచ్చారు. కానీ ఈ డిసెంబర్‌ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. సుమారు లక్షా 35 వేల మంది ఇప్పటివరకు ఫీజు చెల్లించలేదు. ఇరిగేషన్, రెవెన్యూ స్థాయిల్లో కొన్ని పెండింగ్‌లో ఉంటే మరికొన్ని దరఖాస్తుదారుల వద్దనే ఉన్నాయి. స్థలాల పరిశీలనతో నిమిత్తం లేకుండా ఫీజులు చెల్లించవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలామంది దరఖాస్తుదారులు ముందస్తు చెల్లింపుల కోసం వెనుకడుగు వేస్తున్నారు.

ఇదీ చ‌ద‌వండి: భూముల సర్వేలో ‘జెండాలు’

నీటిపారుదల, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయకుండా, ఫీజులు చెల్లించడం వల్ల నష్టపోతామనే సందేహం వల్ల చెల్లింపులకు నిరాకరిస్తున్నారు. అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన దరఖాస్తులనే పరిశీలించడం వల్ల ఈ పథకం ఆచరణలో నత్తనడకన సాగుతోంది. హెచ్‌ఎండీఏకు అందిన 2.73 లక్షల దరఖాస్తుల్లో 1.83 లక్షల మందికి ఫీజు చెల్లించాలని నోటీసులు ఇవ్వగా.. 86,796 మంది మాత్రమే ఫీజులు చెల్లించారు.  

మరోసారి పొడిగిస్తారా... 
ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇలా ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా కొనసాగుతున్న తరుణంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువుపైన సందేహం నెలకొంది. ఈ ఏడాది పూర్తికావస్తున్న దృష్ట్యా మరోసారి గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు అవకాశం లేకపోయినా పెండింగ్‌లో ఉన్నవాటిని పరిష్కరించేందుకు మరోసారి పొడిగింపు తప్పకపోవచ్చునని పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement