ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇక మనం ఎక్కడ తినాలి?’ | Restaurant Kitchen CCTV Food Safety | Sakshi
Sakshi News home page

ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇక మనం ఎక్కడ తినాలి?’

Nov 24 2026 12:10 PM | Updated on Nov 24 2026 12:10 PM

Restaurant Kitchen CCTV Food Safety

కెమెరా కంటికి కనిపించని విషయాలు ఎన్నో..

హోటళ్లు, రెస్టారెంట్లలో తిండి భద్రమేనా?

కస్టమర్లు ఏం గమనించాలి?

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: నోరూరించే బిర్యానీలో బొద్దింకలు, బేకరీల్లో ఎలుకలు, ఖరీదైన 5–స్టార్‌ హోటళ్ల వంట గదుల్లో కూడా కుళ్లిన మాంసం, పండుగ పూట కొనే స్వీట్లలో కల్తీ రంగులు.. ఇటీవల వరుసగా బయటపడుతున్న ఈ దారుణాలు సామాన్యుడి ఆరోగ్యానికి ముప్పుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇక మనం ఎక్కడ తినాలి?’అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో హోటల్‌ వంటగదుల్లో లైవ్‌ సీసీటీవీలు పెట్టాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. అయితే, కేవలం కెమెరాలు పెట్టినంత మాత్రాన మనం తినే తిండి సురక్షితం అవుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

కెమెరా కంటికి కనిపించని నిజాలు!
రెస్టారెంట్‌ కిచెన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు పారిశ్రామికవేత్త హర్‌‡్ష గోయెంకా వంటి ప్రముఖులు సైతం మద్దతు పలుకుతున్నారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే అంటున్నారు ప్రముఖ చెఫ్‌ వంశిక భాటియా. లైవ్‌ స్ట్రీమింగ్‌ అనేది ఫుడ్‌ సేఫ్టీకి పూర్తి పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేస్తున్నారు.

  • వంట వరకే కెమెరా: వంట చేసేటప్పుడు చెఫ్‌ చేతులకు గ్లౌజులు ఉన్నాయా లేదా అని కెమెరా చూపిస్తుంది. కానీ, ఆ వంటలో వాడే నూనె, మాంసం, కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నాణ్యమైనవేనా? అనేది కెమెరా చెప్పలేదు.

  • రాత్రిపూట నిర్లక్ష్యం: ఫ్రిజ్‌లలో రాత్రిపూట సరైన ఉష్ణోగ్రతను మెయింటేన్‌ చేస్తున్నారా? ఉదయం వంట మొదలయ్యే ముందు కిచెన్‌ను శుభ్రం చేశారా? వంటి కీలక అంశాలు లైవ్‌ కెమెరాల్లో కనిపించవు.

  • అపోహలకు తావు: రద్దీ సమయంలో ప్రొఫెషనల్‌ కిచెన్‌ చాలా గందరగోళంగా కనిపిస్తుంది. సిబ్బంది నిబంధనలు పాటిస్తున్నా, బయట నుంచి చూసేవారికి అది అపరిశుభ్రంగా అనిపించే అవకాశం ఉంది.

అసలు ప్రమాదం ఎక్కడుంది?
మన అనారోగ్యానికి కేవలం దుమ్ము, ధూళి మాత్రమే కారణం కాదు. కిచెన్‌లో జరిగే రెండు ప్రధాన తప్పిదాలు ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నాయి:

క్రాస్‌ కంటామినేషన్‌: పచ్చి మాంసం, సీఫుడ్, నేరుగా తినే ఆహార పదార్థాలను ఒకే చోట నిల్వ చేయడం వల్ల ప్రమాదకర బాక్టీరియా సులభంగా వ్యాపిస్తుంది.

ఉష్ణోగ్రతల నియంత్రణ లేకపోవడం: వండిన ఆహారాన్ని గంటల తరబడి బయట ఉంచడం లేదా ఫ్రిజ్‌లో సామర్థ్యానికి మించి సరుకులు కుక్కడం వల్ల ఆహారం త్వరగా పాడవుతుంది.

ఓపెన్‌ కిచెన్లు సాధ్యమేనా?
కస్టమర్లకు నమ్మకం కలిగించడానికి ఓపెన్‌ కిచెన్లు కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా కస్టమర్లందరినీ వర్కింగ్‌ కిచెన్‌ లోపలికి అనుమతించడం సాధ్యం కాదు. తనిఖీ అధికారుల భయంతో కాకుండా, పరిశుభ్రతను ఒక సంస్కృతిగా మార్చుకుని సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇవ్వడమే హోటళ్లకు ఉన్న ఏకైక మార్గం. వినియోగదారులు కూడా జాగ్రత్తలు పాటించక తప్పదు. ఉన్నంతలో అప్రమత్తంగా ఉంటూ ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.  

హోటల్‌కి వెళ్తున్నారా? ఈ 4 విషయాలు మరవకండి!

  • హోటల్‌లో అందరికీ కనిపించే చోట ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ నంబర్, సర్టిఫికెట్‌ ఉందో లేదో గమనించండి.

  • ప్యాకేజ్డ్‌ ఫుడ్స్, కూల్‌ డ్రింక్స్‌ కొనేటప్పుడు తయారీ, గడువు తేదీలను తప్పక చూడండి. ఎలర్జీ రాగల అవకాశం ఉన్న మూలకాల 
    వివరాలు స్పష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి.  

  • వేడిగా ఉండాల్సిన ఆహారం చల్లబడితే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అలాగే పాలు, సీఫుడ్‌ వంటివి సరైన కూలింగ్‌లో ఉన్నాయో లేదో గమనించండి.

  • ఆహారం వాసనలో గానీ, రుచిలో గానీ ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే తినడం ఆపేసి యాజమాన్యానికి ఫిర్యాదు చేయండి.

ఇదీ చదవండి: భారతదేశంలో ఫస్ట్ ‘ఎస్టీడీ’ కాల్ ఎలా మొదలైందో తెలుసా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement