సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియాకు నోటీసులు! | Sonia Gandhi faces legal notice from Savarkars grandnephew | Sakshi
Sakshi News home page

సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియాకు నోటీసులు!

Nov 24 2026 11:40 AM | Updated on Nov 24 2026 11:44 AM

Sonia Gandhi faces legal notice from Savarkars grandnephew

ముంబై: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన పుస్తకంలో వీర సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆమెకు లీగల్‌ నోటీసులు పంపారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌ మునిమనవడు సత్యకి సావర్కర్‌ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల ప్రచురితమైన తన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, తప్పులను సరిదిద్దాలని నోటీసులో డిమాండ్‌ చేశారు. పుస్తకంలోని 201, 443 పేజీల్లోని వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని సత్యకి తరఫు న్యాయవాది సంగ్రామ్‌ కొల్హట్కర్‌ పేర్కొన్నారు.

తన పుస్తకంలో సోనియా గాంధీ ఆర్ఎస్ఎస్‌, సావర్కర్‌పై విమర్శలు చేశారు. బ్రిటిష్ పాలకులకు సావర్కర్‌ క్షమాపణ పత్రాలు రాశారని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్‌ పాలకుల దాడులు, జైలు శిక్షలను ఎదుర్కొన్నారని రాశారు. ఆర్ఎస్ఎస్‌ సభ్యులు బ్రిటిష్ అధికారులకు సమాచారమిచ్చేవారని కూడా ఆరోపించారు. సోనియా గాంధీ ఢిల్లీలోని నివాసానికి పోస్టు, ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపినట్లు న్యాయవాది తెలిపారు. నోటీసు అందిన 15 రోజుల్లోగా డిమాండ్లను నెరవేర్చకపోతే సంబంధిత న్యాయస్థానం లేదా అధికారులను ఆశ్రయిస్తామని సత్యకి హెచ్చరించారు.

మరోవైపు సోనియా గాంధీ పుస్తకంపై నిషేధం విధించాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. సావర్కర్‌పై వ్యాఖ్యలను పలువురు శివసేన నేతలు తప్పుబట్టారు. ఈ విషయంలో ఉద్ధవ్‌ ఠాక్రే మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి పుస్తకాన్ని స్వీకరించిన ఆయన.. సావర్కర్‌పై వ్యాఖ్యల విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఇదీ చదవండి: నదిలో మాయమైన గురునానక్‌.. మూడు రోజుల తర్వాత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement