కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తన స్నేహితుడిగా అభివర్ణించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్ తమకు శత్రువని, ఆయనొక హంతకుడని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు పుతిన్‌ను ఎలా పిలుచుకుంటారనేది ఆయన ఇష్టమని, కానీ తమ దృష్టిలో మాత్రం పుతిన్ శత్రువేనని స్పష్టం చేశారు.
చైనాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పుతిన్‌తో జరిగిన త్రైపాక్షిక సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌తో తనకు ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన తన స్నేహితుడని పేర్కొన్నారు. అయితే అమెరికాకు పుతిన్ స్నేహితుడా కాదా అన్నది మాత్రం చెప్పలేనని ట్రంప్ అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం కీవ్‌లోని వంతెనలు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు. 110 క్షిపణులు, వాటిలో 27 బాలిస్టిక్ క్షిపణులు, 400కు పైగా డ్రోన్లతో దాడి చేసినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఇదే అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు.
పుతిన్‌ను స్నేహితుడిగా సంబోధించడం ద్వారా ఆయనపై తగినంత ఒత్తిడి లేదనే సంకేతం వెళ్తుందని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని చాలా మంది ప్రజల దృష్టిలోనూ పుతిన్ హంతకుడేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. రష్యాకు చెందిన క్రూయిజ్ క్షిపణి సహా మూడు గుర్తుతెలియని వస్తువులు తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు పోలాండ్ వెల్లడించింది. ఈ ఘటనపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. ఇది ప్రమాదవశాత్తూ జరిగినట్లు కనిపించడం లేదన్నారు. దీనిని రష్యా చేసిన కవ్వింపు చర్యగా పోలాండ్ అభివర్ణించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పోలాండ్ గగనతల ఉల్లంఘనను తీవ్రంగా ఖండించారు. స్పందించిన నాటో యుద్ధవిమానాలు గగనతలంలోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై రష్యా ఇప్పటివరకు స్పందించలేదు.
ఇదీ చదవండి: గ్యాంగ్‌స్టర్ హత్య: మరో భారతీయునికి జీవిత ఖైదు


