షెన్‌జెన్‌లో సాధించిందేమిటి? | Xi Jinping and Putin and US president Trump held a meeting in Shenzhen | Sakshi
Sakshi News home page

షెన్‌జెన్‌లో సాధించిందేమిటి?

Nov 21 2026 3:39 AM | Updated on Nov 21 2026 3:39 AM

Xi Jinping and Putin and US president Trump held a meeting in Shenzhen

అందరూ ఎదురుచూసిన అగ్రరాజ్య అధినేతల త్రైపాక్షిక సమావేశం గురువారం చైనాలోని షెన్‌జెన్‌లో ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందు ఇద్దరిద్దరుగా మాట్లాడుకుని, అటుపై ముగ్గురూ చర్చించుకున్నారు. ప్రపంచంలో శాంతి, సుస్థిరతల్ని తామే కాపాడాల్సి వుంటుందని వారికి అనిపించినా, అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన అందుకు అనుగుణంగా లేదు. అణుయుద్ధం జరగనీయరాదన్న సంకల్పం ప్రకటించారు సరే... కానీ అదెలా సాధ్యమనుకుంటున్నారో చెప్పలేదు. 

ఇప్పుడు జరుగుతున్న రెండు ప్రధాన యుద్ధాలు– ఉక్రెయిన్, పశ్చిమాసియా ఘర్షణల గురించి కనీస ప్రస్తావన లేకుండా వీరు సాధించబోయే శాంతి, సుస్థిరతలేమిటో ఎవరికీ తెలియదు. అయిదేళ్లుగా దారీతెన్నూ లేకుండా సాగుతూ, సమీప భవిష్యత్తులో పరిష్కారమవుతుందన్న ఆశ కూడా కనబడని ఉక్రెయిన్‌ యుద్ధానికి పుతిన్‌ బాధ్యుడైతే, పశ్చిమాసియా సంక్షోభ సృష్టికర్త ట్రంప్‌. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకూ, పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కూ చైనా లోపాయికారీ సహకారం అందిస్తోంది. కానీ ఉమ్మడి ప్రకటన వాటిపై మౌనంగా ఉండిపోయింది. మరి వీరు ఎవరినుంచి ప్రపంచాన్ని కాపాడతామంటున్నారో అనూహ్యం. కనీసం మావల్ల ముప్పు ఉండబోదని ప్రకటిస్తే వేరే విషయం!

ప్రపంచానికి సారథ్యంవహిస్తున్నామని తమకు తాము భావించుకుంటున్న ఈ ముగ్గురూ... అందుకోసమైనా కనీస నైతిక విలువలు, జవాబుదారీతనం ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. ప్రపంచదేశాలన్నిటి దగ్గరా మొత్తం 12,000 అణ్వాయుధాలు పోగుపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో రష్యా 5,420తో (దాదాపు 45 శాతం) అగ్రస్థానంలో ఉంటే, అమెరికా 5,042తో (దాదాపు 42 శాతం) రెండో స్థానంలో ఉంది. అంటే 87 శాతం అణ్వస్త్రాలు ఈ రెండింటి దగ్గరే ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న చైనాకు 620 ఉన్నాయి. కానీ ఇప్పుడా సంఖ్యను శరవేగంతో పెంచుకుంటున్నదంటున్నారు. నిజంగా శాంతి సుస్థిరతలు సాధించదల్చుకుంటే, ఈ మూడూ వాటినిస్వచ్ఛందంగా వదులుకోవాలి. కనీసం వాటి నియంత్రణకు ఏం చేయదల్చుకున్నాయో చెప్పాలి. కానీ ఆ మాటెక్కడా లేదు. అణుప్రమాదాల తగ్గింపు, అణ్వాయుధ వ్యాప్తి అరికట్టడం మరెలా?

ఇంతకన్నా 1986నాటి రెక్జావిక్‌ శిఖరాగ్రం నయం. నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్, పూర్వపు సోవియెట్‌ అధినేత మిఖాయిల్‌ గోర్బచెవ్‌ అణ్వాస్త్రాల తొలగింపు ఒప్పందంపై సంతకం చేసేందుకు సంసిద్ధులయ్యారు. కానీ చివరి నిమిషంలో ‘స్టార్‌వార్స్‌’కు స్వస్తి చెప్పేందుకు రీగన్‌ నిరాకరించటంతో అది కాస్తా నిలిచిపోయింది. అయినా సరే, అనంతర కాలంలో అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాలకు అది తోడ్పడింది. 1991లో అమెరికా అధినేత జార్జి బుష్, సోవియెట్‌ అధినేత గోర్బచెవ్‌ సంతకంచేసిన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌–1) 1994లో మొదలై2009లో ముగిసిపోగా, 2010లో ఒబామా హయాంలో రష్యాతో న్యూ స్టార్ట్‌ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే కనీసం అరకొరగానైనా అప్పట్లో అణ్వాయుధాల పరిమితికి అగ్రరాజ్యాలు సిద్ధపడ్డాయి. మరి ఇప్పుడో?! ఏమీ సాధించకుండా ఎవరి దారిన వారు నిష్క్రమించారు.

ఉల్లంఘించేవారిని శిక్షించే వ్యవస్థ లేకుండా ప్రపం^è  శాంతి ఎలా? అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీజే) వీరి దృష్టిలో ‘దుష్ట సంస్థ’. దాంతోపాటు మరికొన్ని సంస్థలు కూడా వాటి పరిధిని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణ! ఐసీజే ఉనికిలో ఉండగానే ఇంత అరాచకం చేస్తున్నవారు ‘దొంగకు తాళంచెవులు అప్పగించినట్టు’ శిక్షించే బాధ్యత తమకే ఇవ్వాలని భావిస్తున్నట్టున్నారు. వాస్తవం ఏమంటే, ప్రపంచం ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు. ద్వి ధ్రువ, ఏక ధ్రువ ప్రపంచాలు అంతరించాయి. ఇప్పుడు ఏ ధ్రువాలతోనూ పనిలేకుండా ఎవరికి వారే మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చు కుంటున్నారు. కూటములుగా ఏర్పడుతున్నారు. ఏ అగ్రరాజ్యంతోనూ సంబంధంలేకుండా మిగిలిన దేశాలు కలుద్దామని ఇప్పటికే కెనడా ప్రధాని మార్క్‌ కెర్నీ ప్రతిపాదించారు. ఆ దిశగా కదలిక మొదలైంది. తమకున్న ఈమాత్రం పెద్దరికాన్నయినా నిలుపుకొంటాయో, దీన్ని కూడా కోల్పోతాయో తేల్చుకోవాల్సింది ఈ అగ్రరాజ్యాలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement